Tippa Teega : ఔషధ గుణాలు కలిగి ఉన్న తీగ జాతికి చెందిన మొక్కలలో తిప్ప తీగ ఒకటి. గ్రామాలలో తిప్ప తీగ అంటే తెలియని వారుండరు. తిప్ప తీగ ఎక్కువగా పొలాల గట్ల మీద, చేను కంచెలకు, అడవుల్లో చెట్లకు అల్లుకుని పెరుగుతూ ఉంటుంది. పూర్వ కాలంలో అడవిలో ప్రయాణించేటప్పుడు తిప్ప తీగను తొక్కితే దారి తప్పి పోతామని.. అంతా తిరిగి కూడా మళ్లీ తిప్ప తీగ వద్దకే వస్తామని చెబుతుండే వారు. చాలా కాలం నుండి తిప్ప తీగను ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. దీనిని అమృత వల్లి అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. తిప్ప తీగను హిందీలో గిలోయ్ అని పిలుస్తారు.
మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఈ మొక్క ఉపయోగపడుతుంది. ఈ మొక్క ఆకుల కషాయం, వేరు కషాయం చేదుగా ఉంటుంది. మనకు వచ్చే వాత, పిత్త, కఫ సంబంధిత సమస్యలన్నింటినీ నయం చేయడంలో ఈ మొక్క సహాయపడుతుంది. శరీరానికి బలాన్ని చేకూర్చడంలో, మూత్రం సాఫీగా వచ్చేలా చేయడంతోపాటు అధిక జ్వరం, ఇతర దోష జ్వరాలను, అభి ఘూత జ్వరం, మేహ జ్వరం, అధిక దాహం, సుఖ రోగాలు.. వంటి అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఈ మొక్క ఉపయోగపడుతుంది. శరీర తత్వాన్ని మార్చే శక్తి కూడా తిప్ప తీగ మొక్క ఆకులకు ఉంటుంది.
శరీరంలోని అవయావాలలో ఉండే చెడు ద్రవాలను తొలగించడంలో కూడా ఈ మొక్క ఎంతగానో సహాయపడుతుంది. తిప్ప తీగ మొక్క ఆకులకు ఆముదాన్ని పూసి వేడి చేసి 2 లేదా 3 పొరలుగా వేసి కట్టుగా కట్టడం వల్ల మేహ వ్రణములు, మాంసం తిడం వల్ల వచ్చే వ్రణాలు తగ్గుతాయి. ఈ మొక్క వేరుతో చేసిన చూర్ణానికి పాము విషాన్ని హరించే శక్తి ఉంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, గుండె సంబంధిత వ్యాధులను నయం చేయడంలో, సంతాన లేమి సమస్యలను తగ్గించడంలో కూడా ఈ మొక్క ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
తిప్పతీగ ఆకుల రసాన్ని రెండు పూటలా తాగడం వల్ల ఇన్ ఫెక్షన్ల వల్ల వచ్చే జ్వరాలు తగ్గుతాయి. జీర్ణ శక్తిని పెంచడంలో, రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, ఒత్తిడిని తగ్గించడంలో, అధిక బరువు తగ్గడంలో, శ్వాస కోస సంబంధమైన సమస్యలను తగ్గించడంలో ఈ మొక్క ఎంతగానో సహాయపడుతుంది.
కంటి చూపును మెరుగుపరచడంతోపాటు చర్మ సమస్యలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో, శరీరంలో ఉండే నొప్పులను , వాపులను తగ్గించడంలో కూడా ఈ మొక్క ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేద షాపులలో ఈ మొక్క ఆకుల రసం, చూర్ణం, కషాయాలు లభిస్తూ ఉంటాయి. వీటిని వాడడం వల్ల.. మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.