Foxtail Millets Laddu : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొర్రల లడ్డూలు.. రోజుకు ఒక్కటి తింటే చాలు..!

Foxtail Millets Laddu : కొర్రలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం తెలిసిందే. చిరుధాన్యాల్లో ఒకటైన కొర్రలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కొర్రలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు. అయితే కొర్రలతో తయారు చేసే ఈ లడ్డూను రోజుకు ఒకటి తింటే చాలు.. పెద్ద ఎత్తున కొర్రలను తినాల్సిన పనిలేదు. దీంతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఇక కొర్రలతో లడ్డూలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Foxtail Millets Laddu make them like this eat daily one
Foxtail Millets Laddu

కొర్ర లడ్డూల తయారీకి కావల్సిన పదార్థాలు..

కొర్రలు, అవిసె గింజలు, నువ్వులు – ఒక్కోటి కప్పు చొప్పున, బాదం, జీడిపప్పు – ఒక్కోటి గుప్పెడు చొప్పున, నెయ్యి – రెండు టేబుల్‌ స్పూన్లు, బెల్లం తురుము – కప్పున్నర, యాలకుల పొడి – చిటికెడు.

కొర్ర లడ్డూలు తయారీ విధానం..

కొర్రలు, అవిసె గింజలు, నువ్వులను తక్కువ మంట మీద నూనె లేకుండా వేర్వేరుగా వేయించి చల్లార్చుకోవాలి. కడాయిలో నెయ్యి వేసి వేడి చేసి జీడిపప్పు, బాదంపప్పు వేయించుకోవాలి. వీటిని కొర్రలు, అవిసె గింజల్లో వేసుకుని కాస్త బరగ్గా పొడి చేసుకోవాలి. చివర్లో బెల్లం పొడి వేసి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమంలో యాలకుల పొడి, నెయ్యి వేసి గుండ్రంగా ఉండలు చుట్టాలి. పోషకాలు అధికంగా ఉండే ఈ లడ్డూలు పిల్లలకే కాదు.. పెద్దల ఆరోగ్యానికీ మంచివే.

నువ్వుల్లోని కాల్షియం ఎముకలను బలంగా మారుస్తుంది. అవిసె గింజలు గుండె ఆరోగ్యాన్ని సంరక్షించి బరువును తగ్గిస్తాయి. ఇక కొర్రలు బరువును తగ్గించడంతోపాటు షుగర్‌ను అదుపు చేస్తాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. కనుక ఈ లడ్డూలను తయారు చేసుకుని రోజుకు ఒకటి తిన్నా చాలు.. ప్రయోజనాలను పొందవచ్చు.

Admin

Recent Posts