Pesara Idli : పెసర దోశలే కాదు.. ఇడ్లీలు కూడా బాగుంటాయి.. ఇలా చేసుకోవచ్చు..!

Pesara Idli : పెసలు మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. వీటిల్లో ప్రోటీన్లు మాంసంతో సమానంగా ఉంటాయి. అలాగే కోడిగుడ్డు కన్నా ఎక్కువ పోషకాలు ఉంటాయి. కనుక పెసలను నానబెట్టి మొలకెత్తించి తినమని చెబుతుంటారు. అయితే పెసలను నేరుగా అలా తినలేకపోయినా వాటిని వివిధ రకాల వంటకాలుగా తయారు చేసుకుని తీసుకోవచ్చు. ఈ క్రమంలోనే చాలా మంది పెసలతో పెసరట్లు తయారు చేసి తింటుంటారు. ఇక వీటితో పెసల ఇడ్లీలను కూడా తయారు చేయవచ్చు. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Pesara Idli recipe know how to make it
Pesara Idli

పెసలతో ఇడ్లీలు తయారీకి కావల్సిన పదార్థాలు..

పెసర పప్పు – ఒక కప్పు, పచ్చి మిర్చి తరుగు – ఒక టీస్పూన్‌, అల్లం తురుము – ఒక టీస్పూన్‌, ఇంగువ – చిటికెడు, పసుపు – కొద్దిగా, ఉప్పు – తగినంత, పెరుగు – ఒక కప్పు, క్యారెట్‌ తురుము – ఒక కప్పు, బేకింగ్‌ పౌడర్‌ – చిటికెడు, కొత్తిమీర తరుగు – ఒక టేబుల్‌ స్పూన్‌, నూనె – ఒక టీస్పూన్‌, ఆవాలు – ఒక టీస్పూన్‌, జీలకర్ర – ఒక టీస్పూన్‌, కరివేపాకు – రెండు రెమ్మలు.

పెసలతో ఇడ్లీలు తయారు చేసే విధానం..

పెసర పప్పును శుభ్రంగా కడిగి సుమారుగా నాలుగు గంటల పాటు నానబెట్టాలి. తరువాత నీరు వంపేయాలి. మిక్సీలో పెసర పప్పు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము, ఉప్పు, పసుపువేసి మెత్తగా చేయాలి. పెరుగు జత చేసి మరోమారు మిక్సీ తిప్పి, పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని, బేకింగ్‌ పౌడర్‌ జత చేసి మూత ఉంచి గంట సేపు పక్కన ఉంచాలి. స్టవ్‌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. క్యారెట్‌ తురుము జత చేసి మరోమారు వేయించి నానబెట్టుకున్న పెసర పిండి మిశ్రమానికి జత చేసి బాగా కలియబెట్టాలి. ఇడ్లీ రేకులకు కొద్దిగా నూనె రాసి తయారు చేసి ఉంచుకున్న పిండిని ఇడ్లీలుగా వేసి ఆవిరి మీద ఉడికించి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. కొత్తిమీరతో అలంకరించి సాంబారు, కొబ్బరి చట్నీతో తింటే ఇడ్లీలు ఎంతో రుచిగా ఉంటాయి.

Admin

Recent Posts