Raw Coconut Rice : కొబ్బరిని సాధారణంగా ఎండ బెట్టిన తరువాత వాటిని తురుముగా చేసి వంటల్లో వేస్తుంటారు. ఇక పచ్చి కొబ్బరిని కూడా చాలా మంది తరచూ వాడుతుంటారు. దీంతో పచ్చడి తయారు చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. కొందరు పచ్చి కొబ్బరిని నేరుగా అలాగే తినేస్తుంటారు. అయితే దీంతో రైస్ తయారు చేస్తే ఎంతో రుచికరంగా ఉంటుంది. దీన్ని ఉదయం లేదా మధ్యాహ్నం తీసుకోవచ్చు. ఇక పచ్చి కొబ్బరితో రైస్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి కొబ్బరి రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
సన్న బియ్యం – రెండు కప్పులు, పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు, కరివేపాకు – ఒక రెబ్బ, పచ్చి మిరప కాయలు – రెండు, నెయ్యి – నాలుగు టీస్పూన్స్, జీడిపప్పు – తగినన్ని, కిస్మిస్ – తగినన్ని, మినప పప్పు, పెసర పప్పు, ఆవాలు, ఎండు మిరప – తగినన్ని.
పచ్చి కొబ్బరి రైస్‌ను తయారు చేసే విధానం..
ముందుగా రెండు కప్పుల నీళ్లను పోసి అన్నాన్ని ఉడికించాలి. దీన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి. తరువాత ఒక కళాయిలో నెయ్యి వేసి వేడి చేసి పోపు గింజలు (మినప పప్పు, పెసర పప్పు, ఆవాలు, ఎండు మిరప) వేసి తరువాత పచ్చి మిరప, కరివేపాకు వేసి వేయించి తరువాత పచ్చి కొబ్బరి వేసి వేయించి అన్నంలో కలుపుకోవాలి. తరువాత కళాయిలోనే మూడు టీస్పూన్ల నెయ్యి వేసి వేడి చేసి.. జీడిపప్పులు, కిస్మిస్‌లు వేసి వేయించి అనంతరం వాటిని అన్నంలో వేసి బాగా కలపాలి. దీంతో ఎంతో రుచికరమైన పచ్చి కొబ్బరి రైస్ తయారవుతుంది. దీన్ని నేరుగా అలాగే తినవచ్చు. లేదా ఏదైనా చట్నీతో తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. మనకు అనేక పోషకాలు పచ్చి కొబ్బరి ద్వారా లభిస్తాయి. ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.