Guava : మనం అనేక రకాల పండ్లను తింటూ ఉంటాం. అందులో జామ కాయ ఒకటి. మనకు దాదాపుగా అన్ని కాలాలలోనూ జామ కాయ లభిస్తుంది. జామకాయ మనం తినే అనేక రకాల పండ్లలో కంటే ఉత్తమమైనదని నిపుణులు చెబుతున్నారు. మన శరీరానికి జామ కాయ చేసే మేలు అంతా ఇంతా కాదు. అనేక రకాల విటమిన్స్, మినరల్స్ జామకాయలలో ఉంటాయి. అందరూ తినగలిగే, తక్కువ ధరలో లభించే పండ్లలో జామ కాయ ఒకటి.
జామ కాయలు మనకు ఎక్కువగా సహజ సిద్దంగా లభిస్తాయి. వీటిని పెంచడానికి రసాయనాలను, క్రిమి సంహారకాలను ఉపయోగించే అవసరం ఎక్కువగా ఉండదు. అలాగే జామ కాయను మగ్గించడానికి ఎక్కువగా కార్బైడ్ ను ఉపయోగించరు. కనుక జామ కాయలను తినడం వల్ల మన శరీరానికి ఎటువంటి హాని కలగదు. 100 గ్రా. ల జామకాయలో 45 – 50 క్యాలరీల శక్తి ఉంటుంది. కనుక బరువు తగ్గాలనుకునే వారికి కూడా జామ కాయ ఎంతో సహాయపడుతుంది.
విటమిన్ సి ని అధికంగా కలిగి ఉన్న వాటిల్లో జామ కాయ ఒకటి. మన శరీరానికి ప్రతి రోజూ 50 మిల్లీ గ్రాముల విటమిన్ సి అవసరమవుతుంది. 100 గ్రా. ల జామకాయలో సుమారుగా 200 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఒక జామ కాయను తినడం వల్ల మన శరీరానికి కావల్సిన దాని కంటే ఎక్కువగా విటమిన్ సి అందుతుంది.
జామ కాయ విత్తనాలలో కాల్షియం అధికంగా ఉంటుంది. షుగర్ వ్యాధి వచ్చిన వారు కూడా జామకాయను తినవచ్చు. జామ కాయ త్వరగా జీర్ణమవ్వదు కనుక రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. జామకాయలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కనుక అజీర్తి సమస్యను తగ్గించడంలో జామ కాయ ఎంతో ఉపయోగపడుతుంది.
జామకాయను పచ్చిగా కంటే పండుగా మారిన తరువాత తినడం వల్ల అధికంగా ప్రయోజనాలు కలుగుతాయి. జామ కాయ పండడం వల్ల వీటిలో ఉండే మినరల్స్, విటమిన్స్ స్థాయిలు పెరుగుతాయి. అనేక రకాల పండ్లను తిన లేని వారు జామకాయలను తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి.