Saggu Biyyam Java : మనం ఆహారంలో భాగంగా తీసుకునే వాటిల్లో సగ్గు బియ్యం కూడా ఒకటి. వీటి గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. సగ్గు బియ్యంతో ఎంతో రుచిగా ఉండే పాయసాన్ని, ఉప్మాను, వడలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఈ సగ్గు బియాన్ని తినడం వల్ల కూడా మనం ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. సగ్గు బియ్యాన్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. సగ్గుబియ్యాన్ని తినడం వల్ల శరీరానికి కలిగే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు పెరగడంలో సగ్గుబియ్యం మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. బరువు పెరగాలనుకునే వారు వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తక్షణ శక్తిని ఇవ్వడంలో కూడా సగ్గుబియ్యం మనకు ఎంతగానో సహాయపడతాయి. సగ్గుబియ్యం చాలా త్వరగా జీర్ణమవుతాయి. కనకు వీటిని చిన్న పిల్లలకు కూడా ఆహారంగా ఇవ్వవచ్చు. సగ్గుబియ్యాన్ని నీటిలో ఉడికించి పంచదారను కలుపుకుని తినడం వల్ల అజీర్తి, మలబద్దకం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.
సగ్గుబియ్యంలో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఉంటాయి. వీటిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. సగ్గుబియ్యంలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. కనుక గర్భిణీ స్త్రీలు వీటిని ఆహారంగా తీసుకుంటూ ఉండడం వల్ల గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఉంటుంది.
వీటిలో అధికంగా ఉండే ప్రోటీన్లు కండరాలను బలంగా ఉంచడంలో ఉపయోగపడతాయి. జ్వరం వచ్చినప్పుడు సగ్గుబియ్యం జావను తాగడం వల్ల శరీరంలో అధికంగా ఉండే వేడి తగ్గడంతోపాటు శరీరానికి తక్షణ శక్తి లభించి.. నీరసం కూడా తగ్గుతుంది. ఈ విధంగా సగ్గుబియ్యం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, వీటిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.