ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా వసంత కాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో సహజంగానే చాలా మందికి అలర్జీలు వస్తుంటాయి. గాలిలో ఉండే కాలుష్య కారకాలు, దుమ్ము, ధూళి కణాలు తదితర అనేక కారకాల వల్ల చాలా మందికి అలర్జీలు వస్తుంటాయి. దీంతో దద్దుర్లు రావడం, దగ్గు, జ్వరం, ఆస్తమా, ముక్కు దిబ్బడ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. అలర్జీల్లోనూ చాలా రకాలు ఉంటాయి. వాటిల్లో ఏదైనా సరే ఈ సీజన్‌లో దాడి చేసేందుకు అవకాశం ఉంటుంది. మనం పుప్పొడి, ఇతర కాలుష్య కారకాలను ముక్కు ద్వారా పీల్చినప్పుడు అవి శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీంతో వాటిని నిర్మూలించేందుకు శరీరంలో యాంటీ బాడీలు విడుదలవుతాయి. అలాగే హిస్టామైన్స్ అనబడే రసాయనాల వల్ల దగ్గు, ముక్కు కారడం, కళ్లు దురదలు పెట్టడం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ సీజన్‌లో వచ్చే అలర్జీలను నిర్మూలించేందుకు పలు ఇంటి చిట్కాలు ఎంతగానో సహాయ పడతాయి.
అశ్వగంధ, బల, విదరి మూలికలను సమాన భాగాలుగా తీసుకుని పొడి చేయాలి. ఒక కప్పు నీటిలో ఆ మిశ్రమం 1 టీస్పూన్ వేసి 3 నిమిషాల పాటు నీటిని మరిగించాలి. తరువాత అందులో 5 నుంచి 10 చుక్కల మహా నారాయణ తైలం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని 10 నుంచి 15 నిమిషాలకు ఒకసారి ఒక సిప్‌లా తాగాలి. అయిపోయే వరకు ఆ మిశ్రమం తాగాలి. ఆ తైలం లేకపోతే నెయ్యి కూడా కలుపుకోవచ్చు.
రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ త్రిఫల చూర్ణం కలిపి తాగాలి. దీని వల్ల అలర్జీలు తగ్గుతాయి. మలబద్దకం సమస్య ఉండదు.
అలర్జీల సమస్య ఉన్నవారు వీలైనంత వరకు ఇండ్లలోనే ఉండడం మంచిది. బయటకు వెళితే మాస్క్‌లను ధరించండి. దీంతో కాలుష్య కణాలు, పుప్పొడి రేణువులు ముక్కులోకి వెళ్లవు. అలర్జీలు రాకుండా ఉంటాయి.
సాధారణంగా మన ముక్కు రంధ్రాల్లోంచే కాలుష్య అణువు, పుప్పొడి రేణువులు లోపలికి వెళ్తాయి. కనుక ఆ రంధ్రాల్లో ఒకటి రెండు చుక్కల నెయ్యి వేయాలి. దీంతో ఆ ప్రాంతం వరకు ఆ రేణువులు వచ్చి ఆగిపోతాయి. అక్కడి నుంచి లోపలికి వెళ్లవు. ఫలితంగా అలర్జీలు రాకుండా ఉంటాయి.
సీజన్లు మారేటప్పుడు తేలికగా జీర్ణం అయ్యే ఆహారాలను తింటే మంచిది. పాలు, పాల ఉత్పత్తులను సీజన్‌లో తింటే కొందరికి అలర్జీలు వస్తాయి. అలాగే కొందరికి డ్రై ఫ్రూట్స్, ఊరగాయలు, వెనిగర్, బ్రెడ్ వంటి పదార్థాలు ఈ సీజన్‌లో పడవు. అందువల్ల ఈ సీజన్ వరకు వాటిని తినకుండా ఉంటే అలర్జీలు రాకుండా ఉంటాయి.