Onions : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అన్న సామెతను మనం ఎంతో కాలంగా వింటూ వస్తున్నాం. వంటల్లో ఉపయోగించే ఉల్లిపాయ మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిని వాడడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఉల్లిపాయను ఉపయోగించి మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఉల్లిపాయను ఔషధంగా ఎలా ఉపయోగించుకోవాలి… దీనిని వాడడం వల్ల ఏయే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అధిక రక్తపోటుతో బాధపడే వారు ఒక టీ స్పూన్ ఉల్లిరసంలో, తేనెను కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
అలాగే భోజనం చేసిన తరువాత రెండు ఉల్లికాడలను తినడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. ఒక జార్ లో ఉల్లిపాయ ముక్కలు, కీరదోస, టమాట క్యారెట్, నిమ్మరసం, కొత్తిమీర వేసి జ్యూస్ గా చేసుకుని తాగాలి. ఇలా తాగడం వల్ల జీర్ణకోశం శుభ్రపడుతుంది. శరీరంలో వ్యాధి నిరోధకత శక్తి పెరుగుతుంది. 20 గ్రాముల ఉల్లిపాయ రసంలో, 2 టీ స్పూన్ల తేనె, ఒక టీ స్పూన్ అల్లం రసం కలిపి భోజనం తరువాత తీసుకోవడం వల్ల ఆయాసం, దగ్గు, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఒక టీ స్పూన్ ఉల్లిపాయ రసంలో, ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి మూడు భాగాలుగా చేయాలి. ఒక్కో భాగాన్ని ఒక్కో పూట సేవించాలి. ఇలా చేయడం వల్ల దగ్గు, జలుబు, టాన్సిల్స్ నొప్పులు తగ్గుతాయి. కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా ఉల్లిపాయ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఆవనూనెలో ఉల్లిపాయ పేస్ట్ ను వేసి వేడి చేయాలి. తరువాత ఈ నూనెను కీళ్ల నొప్పులపై రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అదే విధంగా గడ్డలు, వ్రణాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ముందుగా వాటిపై నూనె రాయాలి. తరువాత ఉల్లిపాయను మెత్తగా నూరి వాటిపై పట్టులా వేసి కట్టుకట్టాలి. ఇలా చేయడం వల్ల గడ్డలు మెత్తబడి త్వరగా మానిపోతాయి. అలాగే ఉల్లిరసంలో దూదిని ముంచి చెవిలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చెవి నుండి శబ్దాలు రావడం తగ్గుతుంది. అలాగే దోమలు ఎక్కువగా ఉన్న చోట ఉల్లిపాయ దంచి ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయ వాసనకు దోమలు పారిపోతాయి. ఉల్లిపాయలు, మెంతి, కొబ్బరి, బెల్లంతో కిచిడీని వండుకుని నెలరోజుల పాటు తినాలి. ఇలా తినడం వల్ల బాలింతలల్లో పాలు పెరుగుతాయి.
అదే విధంగా చిన్న పిల్లల్లో నులిపురుగులు ఉండి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక టీ స్పూన్ ఉల్లిరసంలో, ఒక టీ స్పూన్ తెనే, ఒక టీ స్పూన్ వెనిగర్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజూ రాత్రి పడుకునే ముందు నాకించాలి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో వచ్చే నులిపురుగుల సమస్య తగ్గుతుంది. నువ్వుల నూనెలో ఉల్లిపాయ పేస్ట్ వేసి వేడి చేయాలి. తరువాత ఈ నూనెను గాయాలపై రాయడం వల్ల గాయాలు సెప్టిక్ కాకుండా ఉంటాయి. ఉల్లిపాయ ముక్కలను బాగా ఉడికించాలి. తరువాత ఈ ముక్కలకు వెనిగర్, రాతి ఉప్పు, కొత్తిమీర కలిపి 20 రోజుల పాటు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల రక్తమొలల, అజీర్తి, నులిపురుగులు వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే రెండు మామిడికాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ కలిపి దంచి రసాన్ని తీయాలి. ఈ రసానికి ఉప్పు కలిపి తీసుకోవడం వల్ల వడదెబ్బ ప్రభావం తగ్గుతుంది. ఈ విధంగా ఉల్లిపాయ మనకు ఎంతో మేలు చేస్తుందని దీనిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.