Beauty Tips : ముఖం కాంతివంతంగా ఉండడానికి మహిళలు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందం కోసం మార్కెట్ లో దొరికే రకరకాల కాస్మొటిక్స్ వాడుతుంటారు. ఇవి అధిక ఖర్చుతో కూడినవి. వీటిని వాడడం వల్ల ఫలితం ఎక్కువగా ఉండకపోగా చర్మానికి హాని కలుగుతుంది. ఇంట్లోనే సహజసిద్దమైన పద్దతిలో ఫేస్ వాష్‌లు, ఫేస్ మాస్క్ లను తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు. వాటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. తేనే, ఆల్మండ్ ఆయిల్ చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో సహాయపడతాయి. ఒక టీ స్పూన్ పాల పొడిని తీసుకుని అందులో ఒక టీ స్పూన్ నిమ్మరసం, ఒకటిన్నర టీ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. దీనిని ముఖానికి రాసి 10 నుండి 15 నిమిషాల వరకు మర్దనా చేసిన తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.
2. చర్మాన్ని కాంతివంతంగా చేసే వాటిల్లో టమాటా ఒకటి. టమాటా చర్మ సౌందర్యాన్ని పెంచే ఏజెంట్‌లా పని చేస్తుంది. 2 టీ స్పూన్ ల ఓట్ మీల్ తీసుకుని అందులో టమాట రసం వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. దీనిని ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి. 10 నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
3. ఒక టీ స్పూన్ శనగ పిండిలో 2 టీ స్పూన్ల పాలు, 2 లేదా 3 చుక్కల నిమ్మరసం వేసి పేస్ట్ లా చేసుకుని దానిని ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తరువాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా తరచూ చేయడం వల్ల చర్మానికి నిగారింపు వస్తుంది.
4. ఆలు గడ్డను ముక్కలుగా కోసి ముఖంపై ఉంచుకోవాలి. కళ్ల కింద నల్లటి వలయాలు ఉన్న వారు ఆలుగడ్డ ముక్కలను వాటిపై మర్దనా కూడా చేసుకోవచ్చు. 10 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా వారం పాటు చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు.
ఈ చిట్కాలను పాటించడం ద్వారా ముఖం కాంతివంతంగా తయారవుతుంది. చర్మానికి ఎటువంటి హాని కలగదు. తక్కువ ఖర్చుతో అందం మీ సొంతమవుతుంది.