Hair Fall : జుట్టు రాలడం అనే సమస్య చాలా మందికి ఉంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే పోషకాహార లోపం ఇందుకు ప్రధానమైన కారణం అని చెప్పవచ్చు. ఒత్తిడి, ఆందోళన, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు.. ఇలా ఎన్ని కారణాలు ఉన్నా సరే.. పోషకాహార లోపం వల్లే జుట్టు అధికంగా రాలుతుంది. కానీ కింద తెలిపిన ఆహారాలను రోజూ తీసుకుంటే దాంతో పోషకాహార లోపం సమస్యను తగ్గించవచ్చు. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే జుట్టు పెరుగుతుంది. శిరోజాలకు ఉండే ఇతర సమస్యలు కూడా పోతాయి. మరి జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తీసుకోవాల్సిన ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
మన శరీరంలో ఐరన్, జింక్, విటమిన్ బి7 (బయోటిన్)లు జుట్టు సంరక్షణకు కారణమవుతాయి. కనుక ఇవి ఉండే ఆహారాలను అధికంగా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కోడిగుడ్లు, చేపలు, మటన్ లివర్, తృణ ధాన్యాలు, నట్స్, సీడ్స్, అవకాడో, పెరుగు, చీజ్, మొలకెత్తిన విత్తనాలను రోజూ తీసుకోవాలి. వీటి వల్ల ముందు చెప్పిన విటమిన్లు, మినరల్స్ శరీరానికి లభిస్తాయి. దీంతో జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. దృఢంగా మారుతుంది. జుట్టు రాలడం తగ్గి పెరుగుతుంది. చుండ్రు నుంచి కూడా బయట పడవచ్చు.
ఇక జుట్టుకు రాసే నూనె కూడా ముఖ్యమైందే. దీని వల్ల కూడా జుట్టు సమస్యలు తగ్గుతాయి. జుట్టుకు నూనె రాసి 10 నిమిషాల పాటు సున్నితంగా మర్దనా చేయాలి. జుట్టు కుదుళ్లకు తగిలేలా మర్దనా చేయాలి. దీని వల్ల తలకు రక్తసరఫరా మెరుగు పడుతుంది. పోషకాలు బాగా లభిస్తాయి. జుట్టు రాలడాన్ని ఆపవచ్చు. అయితే తలకు కొబ్బరినూనె లేదా బాదంనూనె రాస్తే మంచిది. దాన్ని కాస్త వేడి చేసి రాస్తే ఇంకా మంచి ఫలితం లభిస్తుంది. జుట్టుకు నూనె రాశాక టవల్‌ను తలకు చుట్టి 5 నిమిషాల పాటు ఉండాలి. తరువాత టవల్‌ను తీసేయాలి. దీంతో జుట్టు నూనెను బాగా గ్రహిస్తుంది. అక్కడి చర్మంలోకి నూనె పోతుంది. దీంతో ఆ నూనె జుట్టుకు పోషణను అందిస్తుంది. ఇక టవల్ తీసిన తరువాత 1 గంట పాటు అలాగే ఉండి ఆ తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఇక తలస్నానం వారానికి ఎన్ని సార్లు చేయాలనే సందేహం కూడా కొందరికి వస్తుంటుంది. పొడి జుట్టు ఉన్నవారు వారానికి మూడు సార్లు తప్పకుండా తలస్నానం చేయాలి. ఇతరులు రెండు సార్లు చేస్తే చాలు. ఇలా జుట్టును సంరక్షించుకోవచ్చు. జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు. జుట్టు పెరుగుదల కూడా వేగంగా ఉంటుంది. అలాగే వారంలో రెండు సార్లు జుట్టుకు ఉల్లిపాయ రసం రాసి ఆ తరువాత తలస్నానం చేయాలి. లేదా కరివేపాకుల పొడిని కూడా ఉపయోగించవచ్చు. ఇందులో కాస్త కొబ్బరినూనె కలిపి జుట్టుకు రాసి తరువాత 1 గంటయ్యాక తలస్నానం చేయాలి. ఈ విధంగా చిట్కాలను పాటిస్తే జుట్టు బాగా పెరుగుతుంది.