Mangu Machalu : మనకు వచ్చే చర్మ సంబంధమైన సమస్యలలో మంగు మచ్చలు కూడా ఒకటి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఈ సమస్య అందరినీ వేధిస్తోంది. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు, శరరీంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు, అందం కోసం రసాయనాలు కలిగిన ప్రొడక్ట్స్ ను వాడినప్పుడు, ప్రమాదకరమైన సూర్య కిరణాలు మన ముఖంపై ఎక్కువగా పడినప్పుడు ఈ మంగు మచ్చలు ముఖంపై వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా స్త్రీలు గర్భం దాల్చినప్పుడు మంగు మచ్చలు ముఖంపై వచ్చి ప్రసావానంతరం వాటంతట అవే పోతాయి. దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడే వారిలో, అధికంగా మందులను వాడే వారిలోనూ ఈ మంగు మచ్చలు వస్తాయి. ఈ విధంగా మంగుమచ్చలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి.
ఈ మంగు మచ్చలు మన ముఖంపైనే కాకుండా ఇతర శరీర భాగాలపై కూడా వస్తాయి. మంగు మచ్చల కారణంగా ముఖం అందవిహీనంగా కనబడుతుంది. అయితే ఎటువంటి మందులను, క్రీములను వాడే పని లేకుండానే ఆయుర్వేదం ద్వారా మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఆయుర్వేదంలో ఎంతగానో ఉపయోగించే పునర్నవ మొక్కను వాడి మన చర్మంపై వచ్చే మంగు మచ్చలను తగ్గించుకోవచ్చు. ఇవి ఎక్కడపడితే అక్కడ మనకు కనిపిస్తూనే ఉంటాయి. దీనిని తెల్ల గలిజేరు అని కూడా పిలుస్తూ ఉంటారు. వర్షాకాలంలో ఈ మొక్క ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది.
పునర్నవ మొక్క ఆకులను సేకరించి మెత్తగా దంచి దాని నుండి రసాన్ని తీసుకోవాలి. దీంట్లో కొద్దిగా పాలను, తేనెను కలిపి మంగు మచ్చలపై ప్రతిరోజూ రాయాలి. ఇలా చేయడం వల్ల క్రమేపీ మంగు మచ్చలు తగ్గుతాయి. ఈ రసాన్ని ముఖానికి రాసుకోవడం వల్ల మంగు మచ్చలే కాకుండా మొటిమలు, నల్ల మచ్చలు, జిడ్డు చర్మం వంటి సమస్యలు కూడా తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది. ఈ విధంగా పునర్నవ మొక్క మనకు వచ్చే మంగు మచ్చలతోపాటు ఇతర చర్మ సంబంధమైన సమస్యలైన మొటిమలు, నల్లమచ్చలను నయం చేసి ముఖం కాంతివంతంగా అయ్యేలా చేస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.