Potato Soap : మనం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన కూరగాయల్లో బంగాళాదుంప కూడా ఒకటి. బంగాళాదుంపలతో మనం వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసిన ఎటువంటి వంటైనా రుచిగా ఉంటుంది. చాలా మంది బంగాళాదుంపలతో చేసిన వంటకాలను ఇష్టంగా తింటూ ఉంటారు. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. కేవలం ఆరోగ్యాన్ని కాపాడడంలోనే కాకుండా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో కూడా బంగాళాదుంప మనకు ఉపయోగపడుతుంది.
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు చర్మంపై పేరుకుపోయిన నలుపును తొలగించి చర్మాన్ని అందంగా, కాంతివంతంగా చేయడంలో కూడా బంగాళాదుంప మనకు ఉపయోగపడుతుంది. బంగాళాదుంపకు ఇతర పదార్థాలను కలిపి సబ్బును తయారు చేసుకుని వాడడం వల్ల చర్మం నిగారింపును సొంతం చేసుకుంటుంది. బంగాళాదుంపలతో సబ్బును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇందుకోసం ముందుగా ఒక పెద్ద బంగాళాదుంపను తీసుకుని దానిని ముక్కలుగా చేసుకోవాలి. ఈ ముక్కలను జార్ లో వేసి మొత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన బంగాళాదుంప మిశ్రమాన్ని వస్త్రంలో లేదా జల్లిగంటెలో వేసి రసాన్ని తీసుకోవాలి. తరువాత మనం స్నానం చేయడానికి ఉయోగించే సబ్బును తీసుకోవాలి. రసాయనాలు తక్కువగా ఉన్న సబ్బును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ సబ్బును మనం కూరగాయలను తురిమినట్టుగా చిన్నగా తురుముకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న బంగాళాదుంప రసాన్ని వేసి కలుపుకోవాలి.
ఇందులోనే ఒక టీ స్పూన్ కలబంద గుజ్జునువేయాలి. అలాగే ఒక టీ స్పూన్ బాదం నూనెను కూడా వేసుకోవాలి. పొడి చర్మం కలిగిన వారు మాత్రమే బాదం నూనెను ఉపయోగించాలి. జిడ్డు చర్మం ఉన్నవారు బాదం నూనెను ఉపయోగించకూడదు. ఇప్పుడు ఈ పదార్థాలన్నీ కలిసేలా మనం తీసుకున్న గిన్నెను మరుగుతున్న నీరు ఉన్న మరో గిన్నెలో 5 నిమిషాల పాటు ఉంచాలి. ఈ మిశ్రమం అంతా కలిసేలా బాగా కలుపుతూ ఉండాలి. పూర్తిగా కలిసేలా కలిపిన తరువాత ఈ మిశ్రమాన్ని మనకు నచ్చిన ఆకృతి ఉన్న అచ్చులో వేయాలి.
తరువాత ఈ అచ్చులను 6 నుండి 7 గంటల పాటు కదిలించకుండా ఉండాలి. తరువాత సబ్బును అచ్చు నుండి వేరు చేయాలి. ఇలా తయారు చేసిన బంగాళాదుంప సబ్బును ప్రతిరోజూ వాడడం వల్ల చర్మం ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా మచ్చలు, జిడ్డు, మొటిమలు తొలగిపోయి ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. ఈ విధంగా బంగాళాదుంప మనకు సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది.