అందానికి చిట్కాలు

గులాబీ పువ్వులతో అందం.. చర్మ సౌందర్యానికి ఎలా వాడాలంటే..?

గులాబీ పూలను ప్రేమకు చిహ్నంగా, సౌందర్యానికి ప్రతీకలుగా భావిస్తారు. అంతేకాదు పెళ్లిళ్లలో అలంకరణతో మొదలు పెట్టి ఆహ్వానాల వరకు ఈ పూలకే పెద్ద పీట వేస్తారు. ప్రేమను ఎంతో అందంగా తెలిపే ఈ గులాబీలు సౌందర్య పోషణలోనూ మాదే పైచేయి అంటున్నాయి. అంతేకాకుండా పెళ్లి కూతుళ్లు రోజ్‌ థెరపీ చేయించుకుంటే సౌందర్య ద్విగుణీకృతం కావడం గ్యారెంటీ అంటున్న గులాబీల బ్యూటీ సీక్రెట్స్‌ ఇవే..

take care of beauty with rose flowers

రోజ్‌ ఆయిల్‌, రోజ్‌ వాటర్‌ అంతెందుకు గులాబీ పూరేకులు చాలు మిమ్మల్ని అందంగా చేసేందుకు. చర్మానికి నిగారింపును ఇవ్వడమే కాకుంగా మాడుని శుభ్ర పరుస్తాయి. ఇన్‌ఫెక్షన్లను కూడా తగ్గిస్తాయి. రోజ్‌ వాటర్‌ లేదా గులాబీ పూల రేకులు సహజసిద్ధమైన స్కిన్‌ టోనర్‌గా పనిచేస్తాయి. టోనర్‌ తయారీ ఎలాగంటే.. కొన్ని గులాబీ పూల రేకులను నీళ్లలో వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు అవసరమనుకుంటే నీళ్లను వడకట్టొచ్చు లేదా పూల రేకులతో కలిపే ఒక సీసాఆలో పోసి ఉంచేయొచ్చు.

ఒక వేళ మీకు దీన్ని తయారు చేసుకునేంత సమయం లేకపోతే నాణ్యమైన రోజ్‌ వాటర్‌ను కొనాలి. ఈ నీళ్లలో శుభ్రమైన దూది ఉండను ముంచి ముఖంపై గుండ్రగా సున్నితంగా రుద్దుతూ తుడవాలి. చర్మం శుభ్రపడి, మెరుస్తూ మృదువుగా తయారవుతుంది.

గులాబీ పువ్వుల రేకుల్లో ఉండే యాంటీ బాక్టీరియల్‌ గుణాలు చర్మ ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయి. గంధం, మెత్తగా నలిపిన గులాబీ పువ్వుల రెక్కలు, రోజ్‌ వాటర్‌, కొన్ని చుక్కల తేనెను వేసి కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకుని పది నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.

రోజ్‌ వాటర్‌లో రెండు దూది ఉండల్ని నానబెట్టి కంటి మీద పెట్టి పది నిమిషాల పాటు ఉంచాలి. ప్రతి రోజూ రాత్రి నిద్రపోయే ముందు ఇలా చేస్తే కళ్ల కింద నల్లని వలయాలు తగ్గిపోతాయి.

పొడిచర్మం ఉన్నవారు గులాబీలను వాడితే మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి. గులాబీ పూల రేకుల్లో ఉండే సహజసిద్ధమైన నూనెలు చర్మం లోతు నుంచి తేమను అందిస్తాయి. మాయిశ్చరైజర్‌లో కొద్దిగా రోజ్‌ వాటర్‌ కలిపి వాడాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.

గులాబీల్లో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా సన్‌ బ్లాక్‌ గుణాలు ఉంటాయి. సహజసిద్ధమైన సన్‌ స్క్రీన్‌ లోషన్‌ తయారీ కోసం గులాబీ పువ్వుల రేకుల్ని మెత్తగా చేసి అందులో కీర దోసకాయ రసం, గ్లిజరిన్‌ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని బయటకు వెళ్లేటప్పుడు అర గంట ముందు ముఖం, మెడ మీద రాసుకోవాలి.

మృత కణాలు పేరుకుపోవడం వల్ల చర్మం నిర్జీవంగా, నిస్సారంగా కనిపిస్తుంది. ఇలా మారిన చర్మం నిగారింపును సంతరించుకోవాలంటే గులాబీ పూలని మించిన ఆయుధాలు లేవు. కొన్ని బాదం గింజల్ని, గులాబీ పూల రేకుల్ని విడివిడిగా నీళ్లలో వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు నానబెట్టిన వాటిని విడివిడిగానే మిక్సీలో వేసి మెత్తని గుజ్జు పట్టాలి. ఆ తరువాత ఈ రెండు పేస్ట్‌లను కలిపి స్క్రబ్బర్‌గా వాడితే మృత కణాలు తొలగిపోతాయి.

చర్మం నిగారింపుకే కాకుండా మాడుకి కూడా పోషణ అందిస్తాయి. తలస్నానం చేసే నీళ్లలో రోజ్‌ వాటర్ కలిపి తలను శుభ్రంగా కడిగేయాలి. దీని వల్ల మాడుకి రక్త ప్రసరణ జరుగుతుంది. జుట్టు పెరిగేందుకు కూడా దోహదపడుతుంది.

ఎర్ర గులాబీలను వాడితే మూడ్‌ సెట్‌ అవుతుంది. ఇందుకు బాత్‌ టబ్‌లో వేడి నీళ్లు పోసి అందులో ఎరుపు రంగు గులాబీ పువ్వుల రేకలు వేసి కాసేపు రిలాక్స్‌ అవాలి. గులాబీ పువ్వుల రెక్కలు విశ్రాంతిని ఇవ్వడమే కాకుండా ఆందోళనను తగ్గించి శరీరాన్ని, మనస్సును డిటాక్స్‌ చేస్తాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts