Black Hair : ప్రస్తుత కాలంలో చాలా మందికి చిన్న వయస్సులోనే జుట్టు తెల్లగా మారుతోంది. ఆహారపు అలవాట్లల్లో మార్పులు రావడం, అధిక ఒత్తిడి, వాతావరణ కాలుష్యం వంటి వాటిని తెల్ల జుట్టు రావడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఈ సమస్య నుండి బయట పడడానికి మార్కెట్ లో దొరికే రకరకాల షాంపులను, హెయిర్ డై లను వాడుతున్నారు. వీటి వల్ల ఫలితం తాత్కాలికంగా ఉండడమే కాకుండా అధిక ఖర్చుతో కూడుకున్నవి. వీటిని అధికంగా వాడడం వల్ల వీటిల్లో ఉండే రసాయనాల కారణంగా చర్మ సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
సహజ సిద్దమైన పద్దతిలో ఇంట్లో తయారు చేసుకోవడానికి వీలుగా ఉండే ఓ పేస్ట్‌ను వాడడం వల్ల తక్కువ ఖర్చుతో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. దీనిని వాడడం వల్ల చర్మానికి ఎటువంటి హాని కలగదు. ఈ పేస్ట్ ను ఎలా తయారు చేసుకోవాలి, తయారీకి కావల్సిన పదార్థాలను, వాడే విధానం గురించి.. ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒకటిన్నర లీటర్ నీళ్లను మరిగించి పెట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో అర కప్పు ఎండు ఉసిరి ముక్కలను, 4 కుంకుడు కాయలను, అర కప్పు షీకా కాయలను వేసి.. ముందుగా మరిగించి పెట్టుకున్న నీళ్లను పోసి.. 4 నుంచి 5 గంటల వరకు నానబెట్టుకోవాలి. తరువాత ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని 45 నిమిషాల పాటు నీళ్లను మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు చేతికి గ్లోవ్స్ వేసుకుని మరిగించిన నీటి నుండి పిప్పిని వేరు చేయాలి. ఈ నీటిలో మనం సహజ సిద్దంగా దొరికే హెన్నా పౌడర్ ను ఒక కప్పు వేసి బాగా కలిపి రెండు గంటల పాటు అలాగే ఉంచాలి. ఇలా తయారు చేసుకున్న పేస్ట్ ను జుట్టు కుదుళ్ల నుండి జుట్టు చివరి వరకు పట్టించి రెండు గంటల తరువాత ఎటువంటి షాంపూను వాడకుండా.. మామూలు నీటితో తలస్నానం చేయాలి.
మన తలలో ఉండే తెల్ల జుట్టును బట్టి ఒకటి లేదా రెండు రోజుల తరువాత షాంపుతో తలస్నానం చేయాలి. ఈ విధంగా తరచూ చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. దీనిని సులువుగా, తక్కువ ఖర్చుతో మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ పేస్ట్ ను వాడడం వల్ల చర్మానికి కూడా ఎటువంటి హాని కలగదు.