Winter Skin Care : చలికాలంలో ముఖ్యంగా మనం ఎదుర్కొనే సమస్యల్లో చర్మం పొడిబారడం కూడా ఒకటి. ఈ సమస్య దాదాపు మనందరిని వేధిస్తూ ఉంటుంది. చర్మంపై గీతలు పడడం, చర్మం పగలడం, పెదవులు పగడలం వంటి సమస్యలు చలికాలంలో ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్య నుండి బయటపడడానికి మనం లోషన్స్, క్రీములు, మాయిశ్చరైజర్స్ వంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటాము. వీటిని వాడడం వల్ల ఫలితం ఉన్నప్పటికి చాలా సమయం వరకు వీటి ప్రభావం ఉండదు. అయితే చలికాలంలో కొన్ని చిట్కాలను వాడడం వల్ల మనం మన చర్మాన్ని అందంగా, కాంతివంతంగా, మెరిసేలా చేసుకోవచ్చు. ఈ చిట్కాలను వాడడం వల్ల చర్మం పొడిబారడం తగ్గుతుంది.
చలికాలంలో చర్మ సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో వాతావరణం చల్లగా ఉంటుందని చాలా మంది వేడి నీటితో స్నానం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల చర్మం మరింత ఎక్కువగా పొడిబారుతుంది. అలాగే జుట్టు కూడా ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. కనుక చలికాలంలో వేడి నీటితో ఎక్కువగా స్నానం చేయకూడదు. అలాగే బాదం, కొబ్బరి నూనె, పాలు, తేనె కలిగిన మాయిశ్చరైజర్లను వాడాలి. వీటిని వాడడం వల్ల చాలా సమయం వరకు చర్మం పొడిబారకుండా ఉంటుంది. అలాగే గదిలో హ్యుమిడిపైయర్లను ఉంచుకోవాలి. దీని వల్ల గదిలో వాతావరణం తేమగా ఉంటుంది. చర్మం ఎక్కువగా పొడిబారకుండా తాజాగా ఉంటుంది. అలాగే పెదవులకు లిప్ బామ్ లను రాస్తూ ఉండాలి.
పెదవులు ఎల్లప్పుడూ తేమగా ఉండేలా చూసుకోవాలి. అలాగే చర్మం యవ్వనంగా, అందంగా కనబడాలనుకునే వారు రాత్రి పూట ఎక్కువగా నిద్రించాలి. రోజూ 7 నుండి 8 గంటల పాటు నిద్రించడం వల్ల చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా కనబడుతుంది. అలాగే చలికాలంలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో చాలా మంది నీటిని తక్కువగా తాగుతూ ఉంటారు. నీటిని తక్కువగా తాగడం వల్ల కూడా చర్మం పొడిబారుతుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పటికి రోజూ 4 లీటర్ల నీటిని తాగాలి. నీటిని ఎక్కువగా తాగడం వల్ల చర్మం పొడిబారడం తగ్గుతుంది. అదే విధంగా చలికాలంలో టీ ట్రీ ఆయిల్, య్లాంగ్ య్లాంగ్ ఆయిల్, ప్యాచౌలీ ఆయిల్ వంటి వాటిని వాడాలి.
వీటిని వాడడం వల్ల చర్మానికి ఎంతో మేలు కలుగుతుంది. అలాగే అవిసె గింజల నూనె, అవకాడో నూనె, కాఫీ బాడీ పాలిషింగ్ వంటి నూనెలను వాడడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది. అలాగే ముఖాన్ని గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం పొడిబారడం తగ్గుతుంది. ఇక చాలా మంది పగటి పూట మాత్రమే చర్మానికి మాయిశ్చరైజర్లను రాస్తూ ఉంటారు. కానీ రాత్రిపూట కూడా చర్మానికి మాయిశ్చరైజర్లను రాసుకోవాలి. రెటినోల్ ఆధారిత నైట్ క్రీములను రాసుకోవడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది.