Constipation Home Remedies : ప్రస్తుత తరుణంలో చాలా మంది అనేక రకాల జీర్ణ సంబంధిత సమస్యలతో సతమతం అవుతున్నారు. వాటిల్లో మలబద్దకం కూడా ఒకటి. ఇది వచ్చిందంటే ఒక పట్టాన వదిలిపెట్టదు. టాయిలెట్‌లో గంటల తరబడి మల విసర్జన కోసం గడపాల్సి వస్తుంది. మలబద్దకం వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉండడం, వేళకు భోజనం చేయకపోవడం, అతిగా మాంసం తినడం, అతిగా ఆహారం తీసుకోవడం, మద్యం సేవించడం.. వంటివి మలబద్దకం వచ్చేందుకు కారణాలుగా చెప్పవచ్చు. అయితే మలబద్దకం వచ్చినవారు ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన పనిలేదు. పలు సహజసిద్ధమైన చిట్కాలను పాటించవచ్చు. దీంతో మలబద్దకం నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మార్కెట్‌లో మనకు Psyllium husk అని లభిస్తుంది. ఇది పొడి మాదిరిగా ఉంటుంది. ఇందులో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. ఒక టీస్పూన్ Psyllium huskను తీసుకుని దాన్ని ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కలిపి రాత్రి నిద్రకు ముందు తాగాలి. ఇలా రోజూ చేస్తుండడం వల్ల మలం మెత్తబడుతుంది. దీంతో మల విసర్జన సాఫీగా జరుగుతుంది. మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది.
కిస్మిస్‌లు అంటే చాలా మందికి ఇష్టమే. వీటిని చాలా వరకు స్వీట్లలో ఉపయోగిస్తారు. కిస్మిస్‌లను అందరూ ఇష్టంగా తింటారు. అయితే ఇవి మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. కిస్మిస్‌లను తినడం వల్ల జీర్ణవ్యవస్థ క్లీన్ అవుతుంది. దీంతోపాటు మలబద్దకం తగ్గుతుంది. అయితే వీటిని రాత్రిపూట గుప్పెడు తీసుకుని నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపునే తినాలి. ఇలా రోజూ తింటుంటే మలబద్దకం అన్న మాటే ఉండదు.
మలబద్దకాన్ని తగ్గించి జీర్ణక్రియను పెంచడంలో మనకు నెయ్యి ఎంతగానో పనిచేస్తుంది. ఒక టీస్పూన్ నెయ్యిని తీసుకుని ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కలిపి రాత్రి నిద్రకు ముందు తాగాలి. ఇలా చేయడం వల్ల పేగుల్లో మలం సులభంగా కదులుతుంది. దీంతో మరుసటి రోజు సుఖ విరేచనం అవుతుంది. మలబద్దకం తగ్గుతుంది. బెల్లం కూడా జీర్ణశక్తిని పెంచడంతోపాటు మలబద్దకాన్ని తగ్గిస్తుంది. రోజూ రాత్రి నిద్రకు ముందు ఒక చిన్న బెల్లం ముక్కను తిని ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలను తాగాలి. దీంతో జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. మరుసటి రోజు ఉదయం మల విసర్జన సాఫీగా జరుగుతుంది. దీంతో మలబద్దకం నుంచి బయట పడవచ్చు. ఇలా ఈ చిట్కాలను పాటిస్తే మలబద్దకం ఇట్టే తగ్గిపోతుంది. ఇది ఉందని కంగారు పడాల్సిన పనిలేదు.