Cracked Heels : కొంతమంది చాలా అందంగా ఉంటారు. పైన నుండి కింది వరకు కూడా చాలా చక్కని శరీర ఆకృతిని కలిగి ఉంటారు. కానీ పాదాల విషయానికి వస్తే మాత్రం అక్కడ చిన్న లోపం ఉంటుంది. చందమామలో చుక్కల మాదిరిగా పాదాలు పగుళ్లను కలిగి ఉంటాయి. పాదాల పగుళ్లు రావడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. అధిక వేడి, పొడి చర్మం, ఎక్కువసేపు నిలబడి పని చేసే వారికి పాదాల పగుళ్లు ఎక్కువగా వస్తాయి. కటిక నేల మీద నడవడం కూడా పాదాల పగుళ్లు ఏర్పడడానికి ఒక కారణమనే చెప్పవచ్చు. ఎత్తైన చెప్పులు ధరించి నడవడం వల్ల పాదాలకు రక్తప్రసరణ సరిగ్గా జరగదు. అలాగే అధిక బరువు కలిగి ఉండడం, పాదాల మీద శ్రద్ధ తీసుకోకపోవడం, పోషకాహార లోపం వంటి వాటిని కూడా పాదాల పగుళ్లకు కారణాలుగా చెప్పవచ్చు.
ఇలా పాదాల పగుళ్లతో బాధపడే వారు ఈ చిట్కాలను పాటించడం వల్ల పాదాలను అందంగా మార్చుకోవచ్చు. ఇంట్లో సాధారణంగా లభించే వాటితోనే పాదాల పగుళ్లను నివారించుకోవచ్చు. పాదాల పగుళ్లను నివారించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు, నిమ్మరసం, గ్లిసరిన్, రోజ్ వాటర్ ను వేసి అందులో గోరు వెచ్చని నీటిని పోయాలి. తరువాత అందులో పాదాలను ఉంచి కొద్ది సేపు అలాగే ఉంచాలి. తరువాత పాదాలను స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాలపై ఉండే మృతకణాలు తొలిగిపోతాయి.
తరువాత ఒక గిన్నెలో నిమ్మరసం, రోజ్ వాటర్, గ్లిసరిన్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రం చేసిన పాదాల పగుళ్లపై రాయాలి. ఇలా వారానికి రెండు నుండి మూడు సార్లు క్రమం తప్పకుండా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇక పాదాల పగుళ్లను నివారించే రెండో చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాగా పగిలిన పాదాలు ఉన్న వారికి ఇది మంచి చిట్కా అని చెప్పవచ్చు. పొడి చర్మం ఉన్న వారికి పాదాల పగుళ్లు ఎక్కువగా వస్తాయి. అలాంటి వారు రాత్రి పడుకునే ముందు పాదాలకు నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ మర్దనా చేయాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు.
ఇక పాదాల పగుళ్లు ఉన్న వారు బాగా మగ్గిన అరటి పండును గుజ్జుగా చేసి పాదాలకు పట్టించాలి. ఒక 15 నిమిషాల తరువాత పాదాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాల పగుళ్లను నివారించుకోవచ్చు. అలాగే ఎక్కువగా పాదాల పగుళ్లు ఉన్నప్పుడు అవకాడో ఫ్రూట్ మసాజ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అవకాడో సగం భాగాన్ని అలాగే పచ్చి కొబ్బరిని జార్ లో వేసి మెత్తగా చేయాలి. తరువాత దీనికి అరటి పండు గుజ్జును కలిపి కాళ్లకు పట్టించి మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాలకు తగినంత తేమ లభిస్తుంది. దీంతో పాదాల పగుళ్లు నివారించబడతాయి. అంతేకాకుండా ఈ చిట్కాను పాటించడం వల్ల పాదాల పగుళ్లు కూడా రాకుండా ఉంటాయి.
పాదాల పగుళ్లను నివారించుకోవడానికి రకరకాల పద్దతులు పాటించి విసిగి పోయిన వారు ఈ చిట్కాను పాటించడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. దీనికోసం ఒక క్యాండిల్ తీసుకుని అందులో దారం తీసేసి ముక్కలుగా చేయాలి. ఈ ముక్కలను ఆవనూనెలో వేసి వేడి చేయాలి. తరువాత కాళ్లను వేడి నీళ్లల్లో ఉంచి శుభ్రం చేయాలి. ఆ తరువాత ఈ ఆవ నూనె మిశ్రమాన్ని పాదాలకు బాగా పట్టించాలి. ఇలా రాత్రి పడుకునే ముందు చేసి తరువాత పాదాలకు సాక్స్ ను వేసుకుని పడుకోవాలి. ఇలా వారం రోజుల పాటు చేయడం వల్ల ఎంతటి పగుళ్లైనా మాయమవుతాయి. ఈ చిట్కాలను పాటించడం వల్ల చాలా సులభంగా పాదాల పగుళ్లను నివారించుకోవచ్చు.