Teeth Problems : దంత సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుందని చెప్పవచ్చు. నోటి దుర్వాసన, పిప్పి పళ్లు, దంతాల నొప్పులు, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి వాటిని దంతాల సమస్యలుగా చెప్పవచ్చు. ఈ దంతాల సమస్యలతో ఇబ్బందిపడే వారు ఇకపై బాధ పడాల్సిన పని లేదు. అసలు ఈ దంతాల సమస్యలు రావడానికి ప్రధాన కారణం బ్యాక్టీరియా అని చెప్పవచ్చు. శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు కూడా దంతాల సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలను చిన్నవే కదా అని నిర్లక్ష్యం చేస్తే అవి పెద్దగా మారే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఈ సమస్యలను మనం నిత్యం వంటింట్లో వాడే పదార్థాలను ఉపయోగించి నయం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
దంతాల సమస్యలను తగ్గించడంలో నువ్వుల నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక కప్పులో నువ్వుల నూనెను తీసుకుని అందులో దూదిని ముంచాలి. ఈ దూదిని దంతాలపై, చిగుళ్లపై రోజుకు మూడు సార్లు మర్దనా చేయాలి. ఇలా 15 రోజుల పాటు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల దంత సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. నువ్వుల్లో దంతాలను గట్టిపరిచి ఇన్ ఫెక్షన్ లను తగ్గించే గుణం ఉంటుంది. అలాగే ఒక టీ స్పూన్ నువ్వుల నూనెను నోట్లో పోసుకుని పుక్కిలించాలి. దీనినే ఆయిల్ పుల్లింగ్ అంటారు. ఇలా చేయడం వల్ల నోట్లో ఎక్కువగా లాలాజలం ఉత్పత్తి అవుతుంది. లాలాజలానికి ఇన్ ఫెక్షన్ లను తగ్గించే శక్తి ఉంటుంది. ఇలా చేయడం వల్ల దంత సమస్యలు నివారించబడతాయి. దంతాలు అందంగా మెరుస్తాయి.
దంత సంబంధిత సమస్యలను నయం చేయడంలో ఉల్లిపాయ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉల్లిపాయను తీసుకుని మెత్తగా ముద్దగా చేయాలి. ఈ మిశ్రమాన్ని బ్రష్ తో తీసుకుని దంతాలను శుభ్రపరుచుకోవాలి. ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ సూక్ష్మ క్రిములను నశింపచేయడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇలా రోజుకు రెండుసార్లు చేయడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. పైన తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల దంత సమస్యల నుండి ఉపశమనాన్ని పొందవచ్చు.
అసలు దంత సంబంధిత సమస్యలు మన దరి చేరకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. భోజనం చేసిన వెంటనే బ్రష్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాల సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే త్రిఫల చూర్ణాన్ని లేదా ఉప్పు నీటిని నోట్లో పోసుకుని తరచూ పుక్కిలిస్తూ ఉండాలి. ఇవి అందుబాటులో లేకుంటే నీటితో అయినా సరే నోటిని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా దంత సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉంటాం. అదే విధంగా ఎప్పుడు పడితే అప్పుడు భోజనం చేయరాదు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మాత్రమే భోజనం చేయాలి.
ఎప్పుడుపడితే ఆహారాన్ని, చిరుతిళ్లను తీసుకోవడం వల్ల దంతాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే కూరగాయలను, పండ్లను తీసుకోవాలి. ఈ ఫైబర్ కారణంగా దంతాలు సహజసిద్ధ పద్ధతిలో శుభ్రపడతాయి. టూత్ బ్రష్ లను ఎక్కువ కాలం వాడడం వల్ల కూడా దంతాల సమస్యలు తలెత్తుతాయి. టూత్ బ్రష్ లను మూడు లేదా నాలుగు నెలలకొకసారి మారుస్తూ ఉండాలి. భోజనం చేసిన తరువాత కొన్ని రకాల ఆహార రేణువులు పళ్ల సందుల్లో ఇరుక్కుపోతాయి. వీటిని తొలగించుకోవడానికి పిన్నీసులను, టూత్ పిక్ లను ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని వాడడం వల్ల సమస్యలు అధికమవుతాయి తప్ప తగ్గవు.
ఈ ఆహార రేణువులను తొలగించడానికి దారాన్ని మాత్రమే ఉపయోగించాలి. ఈ జాగ్రత్తలను పాటిస్తూ పైన చెప్పిన చిట్కాలను పాటించడం వల్ల దంత సమస్యలను సులభంగా తగ్గించుకోవడంతోపాటు ఆయా సమస్యల బారిన పడకుండా ఉంటాం.