Thyroid : ప్రస్తుత కాలంలో మనల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో థైరాయిడ్ సమస్య కూడా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, పోషకాలు లేని ఆహారాన్ని తీసుకోవడం వంటి వాటిని ఈ సమస్య రావడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. థైరాయిడ్ లో కూడా హైపో థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అనే రెండు రకాలు ఉంటాయి.
థైరాయిడ్ గ్రంథి హార్మోన్లను సరిగ్గా విడుదల చేయకపోవడం వల్ల హైపో థైరాయిడిజం వస్తుంది. శరీరంలో థైరాయిడ్ స్థాయిలు తక్కువగా ఉండడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రతలు కూడా తగ్గిపోతాయి. ఈ హైపో థైరాయిడిజంకు వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. లేదంటే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యతో బాధపడే వారు ఎక్కువగా ఐరన్, విటమిన్ బి ఉండే ఆహారాలను, కూరగాయలను, ధాన్యాలను అధికంగా తీసుకోవాలి. వీటితోపాటు విటమిన్ ఎ ఉండే క్యారెట్, గుమ్మడి కాయ, కోడిగుడ్డును అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఉండే తాజా పండ్లను తీసుకోవాలి.
హైపో థైరాయిడిజం ఉన్న వారు బ్రోకోలి, క్యాబేజ్, కాలీఫ్లవర్, పాలకూర, సోయా బీన్స్, వేరు శనగలు, కర్ర పెండలం, సజ్జలు వంటి ఆహార పదార్థాలను తినకూడదు. ఈ హైపో థైరాయిడిజంతో బాధపడే వారు ఇంట్లోనే జ్యూస్ ను తయారు చేసుకుని తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. ఈ జ్యూస్ ను తయారు చేసుకోవడానికి గాను క్యారెట్, బీట్ రూట్, గ్రీన్ ఆపిల్, పైనాపిల్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఒక జార్ లో క్యారెట్ ముక్కలను, బీట్ రూట్ ముక్కలను, గ్రీన్ ఆపిల్ ముక్కలను, పైనాపిల్ ముక్కలను, ఒక గ్లాస్ నీటిని పోసి జ్యూస్ గా చేసుకోవాలి. తరువాత ఈ జ్యూస్ ను వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ ను రోజుకు రెండు పూటలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల హైపో థైరాయిడిజంను తగ్గించుకోవచ్చు.
అదేవిధంగా హైపో థైరాయిడిజంను తగ్గించడంలో ధనియాల నీరు కూడా చక్కగా పని చేస్తుంది. ఈ నీటిని తయారు చేసుకోవడానికి గాను ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను వేసి మరో 10 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో రుచి కోసం ఒక టేబుల్ స్పూన్ తేనెను కలిపి తీసుకోవాలి. ఈ ధనియాల నీటిని రోజూ రెండు పూటలా తీసుకోవడం వల్ల కూడా చక్కటి ఫలితాలను పొందవచ్చు. ఉదయం పూట ఈ నీటిని తాగే వారు పరగడుపున తాగాలి. ఈ ధనియాల నీటిని తాగడం వల్ల హైపో థైరాయిడిజంతోపాటు అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాలను పాటించడం వల్ల హైపో థైరాయిడిజంను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.