Tandoori Masala Powder : చికెన్ తో మనం వివిధ రకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చేసే ప్రతి వంటకం కూడా చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో చేసుకోదగిన వంటకాల్లో తందూరి చికెన్ కూడా ఒకటి. తందూరి చికెన్ చాలా రుచిగా ఉంటుంది. తందూరి చికెన్ కు ఆ రుచి అందులో వాడే తందూరి మసాలా వల్లే వస్తుంది. ఈ మసాలా కారణంగా తందూరి చికెన్ అంత రుచిగా ఉంటుంది. ఈ తందూరి మసాలా పొడి మనకు బయట కూడా దొరుకుతుంది. బయట కొనుగోలు చేసే పని లేకుండానే ఈ తందూరి మసాలాను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో తందూరి మసాలా పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తందూరి మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, సోంపు గింజలు – అర టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, ఎండుమిర్చి – 10 లేదా 12, దాల్చిన చెక్క ముక్కలు – 5 (ఒక ఇంచువి), లవంగాలు – ఒక టీ స్పూన్, యాలకులు – 15, అనాస పువ్వు – 2, జాపత్రి – 2, మిరియాలు – ఒక టీ స్పూన్, శొంఠి – ఒక టీ స్పూన్, ఆమ్ చూర్ – ఒక టీ స్పూన్, కసూరి మెంతి – ఒక టేబుల్ స్పూన్.
తందూరి మసాలా పొడి తయారీ విధానం..
ముందుగా మందంగా ఉండే కళాయిని తీసుకుని అందులో ధనియాలు, జీలకర్ర, సోంపు గింజలు, ముక్కలుగా చేసిన బిర్యానీ ఆకు వేసి దోరగా వేయించాలి. తరువాత ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇవి అన్నీ కూడా వేగిన తరువాత ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత అదే కళాయిలో దాల్చిన చెక్క ముక్కలు, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, జాపత్రి, మిరియాలు వేసి వేయించాలి. ఈ దినులన్నీ చల్లగా అయిన తరువాత ఒక జార్ లోకి తీసుకోవాలి.
ఇందులోనే ముందుగా వేయించిన ఎండుమిర్చితోపాటు మిగిలిన దినుసులను కూడా వేయాలి. తరువాత శొంఠిని ముక్కలుగా చేసి వేయాలి. అలాగే ఆమ్ చూర్, కసూరి మెంతి కూడా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చక్కటి వాసన కలిగి ఉండే తందూరి మసాలా పొడి తయారవుతుంది. తందూరి చికెన్, చికెన్ టిక్కా, బిర్యానీ వంటివి తయారు చేసినప్పుడు ఈ పొడిని ఉపయోగించడం వల్ల మనం చేసే వంటలు మరింత రుచిగా తయారవుతాయి. దీనిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల చాలా రోజుల పాటు తాజాగా ఉండడంతోపాటు చక్కటి వాసనను కూడా కలిగి ఉంటుంది.