Herbs For Hair Growth : జుట్టు అందంగా, ఆరోగ్యంగా, పొడవుగా పెరగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మనం అందంగా కనిపించడంలో జుట్టు కూడా పాత్ర పోషిస్తుంది. కానీ మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలా మంది వివిధ రకాల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు రాలడం, పెరుగుదల ఆగిపోవడం, చుండ్రు, జుట్టు తెల్లబడడం వంటి వివిధ రకాల జుట్టు సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇలా జుట్టు సమస్యలతో బాధపడే వారు రోజురోజుకు పెరుగుతున్నారు. ఈ సమస్యల నుండి బయటపడడానికి ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారు జీవన విధానంలో, ఆహారపు అలవాట్లల్లో మార్పు చేసుకోవడంతో పాటు ఇప్పుడు చెప్పే సహజ సిద్ద పదార్థాలను ఉపయోగించడం వల్ల కూడా మంచి ఫలితంఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
వీటిని వాడడం వల్ల జుట్టు సమస్యలు తగ్గి జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుందని జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయని వారు చెబుతున్నారు. జుట్టు ఆరోగ్యాన్ని, అందాన్ని మెరుగుపరిచే సహజ సిద్ద పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, జుట్టు అందాన్ని మెరుగుపరచడంలో ఉసిరి మనకు ఎంతో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలపరచడంలో, జుట్టును నల్లగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే భృంగరాజ్ ( గుంటగలగరాకు) ను ఉపయోగించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. జుట్టు రాలడాన్ని తగ్గించడంలో, జుట్టు తెల్లబడకుండా నివారించడంలో, జుట్టు ఒత్తుగా, వేగంగా పెరిగేలా చేయడంలో ఇలా అనేక రకాలుగా భృంగరాజ్ మనకు దోహదపడుతుంది.
అలాగే జుట్టు ఒత్తుగా పెరగాలనుకునే వారు మెంతి గింజలను వాడడం మంచిది. జుట్టు కుదుళ్లను ధృడంగా చేసి జుట్టు అందంగా, కాంతివంతంగా మారులా చేయడంలో, చుండ్రును నివారించడంలో మెంతి గింజలు మనకు ఉపయోగపడతాయి. మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి పేస్ట్ గా చేసి జుట్టుకు పట్టించి ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు సమస్యలు తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అదే విధంగా కలబందను వాడడం వల్ల కూడా జుట్టు సమస్యలు తగ్గుతాయి. తలచర్మం పొడిబారకుండా కాపాడడంలో, చుండ్రును నివారించడంలో, జుట్టు కుదళ్లకు బలాన్ని చేకూర్చడంలో అనేక విధాలుగా కలబంద మనకు సహాయపడుతుంది. అంతేకాకుండా కలబంద జుట్టుకు కండీషనర్ గా కూడా పని చేస్తుంది. ఇక మందార పువ్వులను, ఆకులను వాడడం వల్ల కూడా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
జుట్టుకు కావల్సిన పోషణను అందించి, జుట్టును మృదువుగా ఉంచడంలో, త్వరగా పెరిగేలా చేయడంలో ఇది మనకు సహాయపడుతుంది. అదే విధంగా వేపను వాడడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. చుండ్రు, దురద వంటి ఇన్పెక్షన్ లను తగ్గించి జుట్టును ఒత్తుగా పెరిగేలా చేయడంలో వేప మనకు సహాయపడుతుంది. ఈ విధంగా ఈ పదార్థాలు ఉపయోగించడం వల్ల జుట్టు సమస్యలు తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పదార్థాలను వివిధ రకాల హెయిర్ మాస్క్ లల్లో ఉపయోగించుకోవచ్చని అలాగే వీటి నుండి తీసే నూనెలను వాడవచ్చని నిపుణులు చెబుతున్నారు.