Semiya Rava Dosa : సేమియా రవ్వ దోశ.. సేమియా, రవ్వ కలిపి చేసే ఈ దోశ చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని అప్పటికప్పుడు ఇన్ స్టాంట్ గా తయారు చేసుకోవచ్చు. ఈ దోశ చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటుంది. ఉదయం పూట సమయం తక్కువగా ఉన్న వారు అప్పటికప్పుడు ఈ దోశను తయారు చేసి తీసుకోవచ్చు. పప్పు నానబెట్టి, పిండి రుబ్బే అవసరం లేకుండా సేమియా రవ్వ దోశను ఇన్ స్టాంట్ గా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సేమియా రవ్వ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యంపిండి – అర కప్పు, మైదాపిండి – అర కప్పు, వేయించిన సేమియా – అర కప్పు, ఉప్మా రవ్వ – అర కప్పు, చిన్నగా తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన అల్లం – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, మిరియాల పొడి – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, పెరుగు – అర కప్పు, నీళ్లు – తగినన్ని.
సేమియా రవ్వ దోశ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యంపిండిని తీసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని పలుచగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక నీటిని చల్లి తుడుచుకోవాలి. తరువాత దీనిపై సేమియాను చల్లుకోవాలి. తరువాత దీనిపై గంటెతో పిండిని తీసుకుని వేసుకోవాలి. ఇలారవ్వ దోశను వేసుకున్న తరువాత నూనె వేసి కాల్చుకోవాలి. దోశ ఒకవైపు ఎర్రగా కాలిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని చట్నీతో సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సేమియా రవ్వ దోశ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.