ప్లేట్‌లెట్లు పెర‌గాలంటే.. వీటిని తీసుకోవాలి..!

సాధారణంగా మన శరీరంలో ప్లేట్ లెట్ల సంఖ్య తక్కువగా ఉంటే మనం ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మన రక్తంలో ఉండే ఈ ప్లేట్ లెట్స్ ఎంతో చిన్నవిగా ఉంటాయి. ఇవి రక్తం గడ్డకట్టడానికి లేదా మనకు ఏదైనా గాయం తగిలినప్పుడు రక్తస్రావాన్ని ఆపడానికి సహాయపడతాయి.  ప్లేట్ లెట్స్ మన శరీరంలో 5 నుంచి 9 రోజుల వరకు జీవిస్తాయి. ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గితే తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. అయితే పలు చిట్కాలను ఉపయోగించి ప్లేట్ లెట్ల సంఖ్యను ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మన శరీరంలో ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గినప్పుడు వాటి సంఖ్యను పెంచుకోవడానికి బొప్పాయి, వాటి ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతి రోజూ బాగా పండిన బొప్పాయిని తినడం లేదా బొప్పాయి ఆకుల రసాన్ని తాగడం వల్ల మన శరీరంలో ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచుకోవచ్చు. బొప్పాయి ఆకుల రసం తాగడానికి కొద్దిగా చేదు అనే భావన కలిగినా అందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని తాగవచ్చు. అయితే దీన్ని పావు టీస్పూన్‌ మోతాదులోనే వాడాలి. ఎక్కువైతే అనారోగ్య సమస్యలు వస్తాయి.

2. గుమ్మడి కాయలో ఉండే పోషకాలు ప్లేట్‌ లెట్లను ఉత్పత్తి చేయడంలో దోహదపడతాయి. గుమ్మడి కాయ, దాని విత్తనాలను తరచూ తీసుకోవడం వల్ల మన శరీరంలో ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచుకోవచ్చు. రోజూ కప్పు గుమ్మడికాయ ముక్కలను లేదా గుప్పెడు గుమ్మడి కాయ విత్తనాలను తింటే ప్లేట్‌ లెట్ల సంఖ్య పెరుగుతుంది.

3. నిమ్మకాయలో మనకు అధిక మోతాదులో విటమిన్ సి లభిస్తుంది. విటమిన్ సి మన శరీరంలో ప్లేట్ లెట్ సంఖ్యను పెంచడమే కాకుండా మన శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కనుక రోజుకు రెండు సార్లు ఒక టీస్పూన్‌ నిమ్మరసం తాగితే ప్లేట్‌ లెట్ల సంఖ్య పెరుగుతుంది.

4. ఉసిరిలో కూడా అధిక భాగం విటమిన్ సి ఉంటుంది. నిమ్మకాయలో లభించే ప్రయోజనాలన్నీ ఉసిరి ద్వారా మనకు అందుతాయి. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. అందు వల్ల ఇది అనేక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కల్పిస్తుంది. మన శరీరంలో ప్లేట్ లెట్ల సంఖ్యను గణనీయంగా పెంచుతుంది. రోజూ ఉదయాన్నే పరగడుపునే 30 ఎంఎల్‌ మోతాదులో ఉసిరికాయ జ్యూస్‌ను తాగితే మంచిది. లేదా ఉసిరికాయ పొడిని రోజుకు రెండు సార్లు ఒక టీస్పూన్‌ మోతాదులో తేనెతో కలిపి తీసుకోవాలి. దీంతో ప్లేట్‌ లెట్ల సంఖ్య పెరుగుతుంది.

5. బీట్‌రూట్‌ మన శరీరంలో ప్లేట్ లెట్ సంఖ్యను పెంచి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది. ఈ క్రమంలోనే ప్రతి రోజు ఒక గ్లాస్ బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగడం వల్ల మన శరీరంలో ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచుకోవచ్చు.

6. మన శరీరంలో ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచుకోవడానికి గోధుమ గడ్డి రసం కీలకపాత్ర పోషిస్తుంది. ఈ గడ్డిలో అధికంగా క్లోరోఫిల్ ఉండటం వల్ల మన శరీరంలో ప్లేట్ లెట్లను పెంచడానికి సహాయ పడుతుంది. కనుక రోజూ ఉదయాన్నే పరగడుపునే అర కప్పు మోతాదులో గోధుమ గడ్డి జ్యూస్‌ను తాగాలి. ఇది ప్లేట్‌ లెట్ల సంఖ్యను పెంచుతుంది.

7. మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేయడంలో కలబంద కీలక పాత్ర పోషిస్తుంది. రక్తంలో ఏర్పడే ఇన్ఫెక్షన్లను నివారించడానికి,ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడానికి కలబంద రసం దోహద పడుతుంది. రోజూ ఉదయాన్నే పరగడుపునే అర కప్పు మోతాదులో కలబంద రసం తాగితే మంచిది.

8. పాలకూరలో విటమిన్‌ కె ఉంటుంది. ఇది గాయాలు అయినప్పుడు రక్త స్రావం అధికంగా కాకుండా కాపాడుతుంది. రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది. అలాగే పాలకూర జ్యూస్‌ను రోజూ ఉదయం తాగడం వల్ల రక్తంలో ప్లేట్‌ లెట్ల సంఖ్య పెరుగుతుంది.

9. దానిమ్మ పండ్లలో ఐరన్‌ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్‌ లెట్లను ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అలాగే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. యాంటీ ఇన్‌ ఫ్లామేటరీ లక్షణాలు ఈ పండ్లలో ఉంటాయి. వీటిని తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దానిమ్మ పండ్లను రోజూ తింటున్నా లేదా వాటి జ్యూస్‌ను తాగినా ప్లేట్‌ లెట్ల సంఖ్య పెరుగుతుంది. డాక్టర్లు కూడా దానిమ్మ పండ్లను తినాలని చెబుతుంటారు.

10. కిస్మిస్‌లలో ఐరన్‌ అధికంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాలను పెంచుతుంది. ప్లేట్‌ లెట్లు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. రోజూ రాత్రి గుప్పెడు కిస్మిస్‌లను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే వాటిని తినాలి. దీని వల్ల ప్లేట్‌ లెట్ల సంఖ్య పెరుగుతుంది.

11.  విటమిన్‌ బి12 అధికంగా ఉండే కోడిగుడ్లు, మాంసం, చికెన్‌ వంటి పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా ప్లేట్‌ లెట్ల సంఖ్య పెరుగుతుంది.

12. ఫోలేట్‌ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. అలాగే ప్లేట్‌ లెట్ల సంఖ్య కూడా పెరుగుతుంది.

13. పాలలో కాల్షియం అధికంగా ఉంటుంది. అలాగే విటమిన్‌ డి కూడా లభిస్తుంది. ఫోలేట్‌, బి12, విటమిన్‌ కె అధికంగా ఉంటాయి. అందువల్ల పాలను రోజూ తాగితే ప్లేట్‌ లెట్ల సంఖ్యను పెంచుకోవచ్చు. ఉదయం లేదా సాయంత్రం ఒక గ్లాస్‌ పాలు తాగితే చాలు, ప్లేట్‌ లెట్ల సంఖ్య పెరుగుతుంది. అలాగే చీజ్‌, పెరుగును కూడా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.


ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Sailaja N

Recent Posts