Kidney Stones : మన శరీరంలో ముఖ్యమైన అవయావాల్లో మూత్రపిండాలు ఒకటి. ఇవి నిరంతరం పని చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. మన శరీరంలో ఉండే మలినాలను, విష పదార్థాలను మూత్రపిండాలు మూత్రం ద్వారా బయటకు పంపిస్తూ ఉంటాయి. అయితే నీటిని ఎక్కువగా తాగకపోవడం వల్ల ఈ మలినాలు, వ్యర్థ పదార్థాలు మూత్రపిండాల్లో చిన్న చిన్న స్ఫటికాలుగా పేరుకుపోతూ ఉంటాయి. ఈ స్పటికాలకు మరిన్ని వ్యర్థ పదార్థాలు చేరి గట్టిగా రాళ్ల లాగా ఏర్పడతాయి. మూత్రపిండాల్లో రాళ్ల కారణంగా మనలో చాలా మంది బాధపడుతున్నారు. ఈ సమస్య బారిన పడే వారు రోజురోజుకు ఎక్కువవుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ సమస్య బారిన పడుతున్నారు. నీటిని తక్కువగా తాగే వారిలో, మద్యపానం ఎక్కువగా చేసే వారిలో, ఇతర అనారోగ్య సమస్యలకు మందులను వాడే వారిలో, మాంసాహారం ఎక్కువగా తినే వారిలో మూత్ర పిండాల్లో రాళ్లు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి.
అలాగే రక్తంలో యూరిక్ యాసిడ్, క్యాల్షియం, యూరియా, పాస్పేట్ లు ఎక్కువగా ఉన్నా విటమిన్ ఎ, విటమిన్ డి లు ఎక్కువగా ఉన్నా కూడా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతూ ఉంటాయి. దాదాపు పది శాతం మంది దీర్ఘకాలికంగా వాడే మందుల కారణంగానే ఈ సమస్య బారిన పడుతున్నారు. ఈ రాళ్లను తొలగించడానికి శస్త్రచికిత్స ఒకటే మార్గమని చాలా మంది భావిస్తారు. కానీ 5 మిల్లీ మీటర్ల కంటే తక్కువగా ఉండే రాళ్లను మనం చాలా సులభంగా తొలగించుకోవచ్చు. మూత్రపిండాల్లో రాళ్ల కారణంగా విపరీతమైన నొప్పి, మూత్రం సరిగ్గా రాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే ఈ సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. చిన్న సమస్యే కదా అని తేలికగా తీసుకుంటే ప్రాణానికే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఇక మూత్రపిండాల్లో చిన్నగా ఉండే ఈ రాళ్లను మనం కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగించి తొలగించుకోవచ్చు.
మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు ఎక్కువగా నీటిని తాగాలి. కనీసం 5 నుండి 6 లీటర్ల నీటిని తాగాలి. అలాగే మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడంలో మనకు మెంతుల నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. రోజూ రాత్రి ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ మెంతులను వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని తాగి మెంతులను తినాలి. ఇలా చేయడం వల్ల కూడా మూత్రపిండాల్లో రాళ్ల సమస్య తగ్గుతుంది. అలాగే అరటి చెట్టు బెరడును కూడా కూరగా వండుకుని తినడం ద్వారా కూడా మూత్రపిండాల్లో రాళ్ల సమస్య నుండి బయటపడవచ్చు. అదేవిధంగా మనం వంటల్లో ఉపయోగించే కొత్తిమీర కూడా మూత్రపిండాల్లో రాళ్లను తొలగించడంలో మనకు ఉపయోగపడుతుంది.
కొత్తిమీరను నీటిలో వేసి కషాయంలా చేసుకోవాలి. తరువాత ఈ కషాయాన్ని వడకట్టి గ్లాస్ లోకి తీసుకుని తాగాలి. ఇలా కొత్తిమీరతో కషాయాన్ని చేసుకుని తాగడం వల్ల కూడా మనం మంచి ఫలితాలను పొందవచ్చు. అలాగే మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు నేరేడు పండును ఎక్కువగా తీసుకోవాలి. ఇవి దొరికినప్పుడు రోజుకు రెండు లేదా మూడు నేరేడు పండ్లను తినడం వల్ల కూడా మనం మూత్రపిండాల్లో రాళ్లను కరిగించుకోవచ్చు. మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు ఈ చిట్కాలను పాటించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.