Dhaniyala Karampodi : మన వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో ధనియాలు ఒకటి. వీటిని మన వంటింట్లో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. కేవలం వంటల్లోనే కాకుండా ఔషధంగా కూడా వీటిని ఉపయోగిస్తామన్న సంగతి తెలిసిందే. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, రక్తహీనతను తగ్గించడంలో, వివిధ రకాల చర్మ సమస్యలను నయం చేయడంలో ధనియాలు మనకు ఎంతో ఉపయోగపడతాయి. వంటల్లో వాడడంతో పాటు ఈ ధనియాలతో చక్కటి రుచిని కలిగి ఉండే కారం పొడిని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కారం పొడిని ఎవరైనా కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ధనియాలతో రుచిగా కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ధనియాల కారం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
ధనియాలు – ఒక కప్పు, ఎండుమిర్చి – 15 లేదా తగినన్ని, చింతపండు – చిన్న నిమ్మకాయంత, జీలకర్ర – 2 టీ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు – 15, కడిగి ఆరబెట్టిన కరివేపాకు – గుప్పెడు, ఉప్పు – తగినంత, ఇంగువ – పావు టీ స్పూన్, నూనె – 2 టీ స్పూన్స్.
ధనియాల కారం పొడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో ఒక టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి వేసి వేయించాలి. వీటిని మరీ నల్లగా కాకుండా వేయించి జార్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో మరి కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ధనియాలు వేసి వేయించాలి. తరువాత ఇందులోనే కరివేపాకు, జీలకర్ర వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు వేసి కలిపి పూర్తిగా చల్లారే వరకు ఉంచాలి. తరువాత ఎండుమిర్చిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత అందులో ఉప్పు, చింతపండుతో పాటు వేయించిన ధనియాలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ కారం పొడిని గాలి తగలకుండా ప్లాస్టిక్ డబ్బాలో లేదా గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ధనియాల కారం పొడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దోశ, ఇడ్లీ వంటి వాటితో కూడా త కారం పొడిని కలిపి తినవచ్చు. ఈ కారం పొడిని అందరూ ఇష్టంగా తింటారు. ధనియాలతో ఈ విధంగా కారం పొడిని తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ధనియాలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.