Sesame Oil For Hair : మనం ఆహారంగా తీసుకునే నూనె దినుసుల్లో నువ్వులు కూడా ఒకటి. నువ్వులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. వివిధ రకాల వంటకాల్లో నువ్వులను విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. నువ్వులను ఆహారంగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలు అదుపులో ఉంటాయి. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు అదుపులో ఉంటాయి. ఇలాంటి అనేర ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో నువ్వులు మనకు దోహదపడతాయి. కేవలం మన ఆరోగ్యానికి కాకుండే మన జుట్టును సంరక్షించడంలో కూడా నువ్వులు మనకు దోహదపడతాయి. నువ్వుల నూనెను వాడడం వల్ల మనం చక్కటి ఆరోగ్యవంతమైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. జుట్టు కుదుళ్లు బలంగా తయారయ్యేలా చేయడంలో, జుట్టు పొడిబారకుండా చేయడంలో నువ్వుల నూనె మనకు సహాయపడుతుంది.
అలాగే నువ్వుల నూనెను ఉపయోగించడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. సూర్యుడి నుండి వచ్చే అతినీల లోహిత కిరణాల కారణంగా జుట్టు దెబ్బతినకుండా చేయడంలో నువ్వుల నూనె ఎంతో దోహదపడుతుంది. అలాగే నువ్వుల నూనె జుట్టు తెల్లబడకుండా నిరోధిస్తుంది. అలాగే తలలో పేలను నివారించడంలో, జుట్టు అందంగా, కాంతివంతంగా మెరిసేలా చేయడంలో కూడా నువ్వుల నూనె మనకు సహాయపడుతుంది. దీనిలో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్లను బలంగా చేయడంలో, దెబ్బతిన్న జుట్టును తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడంలో సహాయపడతాయి. అలాగే ఒత్తిడి, ఆందోళన కారణంగా జుట్టు రాలకుండా చేయడంలో కూడా నువ్వుల నూనె చక్కగా పని చేస్తుంది. నువ్వుల నుండి తీసిన నూనెతో పాటు నువ్వులు, కొబ్బరి నూనెను కలిపి తయారు చేసిన నూనెను వాడడం వల్ల కూడా మనం చక్కటి ఆరోగ్యవంతమైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. నువ్వులు, కొబ్బరి నూనెను కలిపి మనం చాలా సలుభంగా ఇంట్లోనే నూనెను తయారు చేసుకోవచ్చు.
ఈ నూనెను తయారు చేయడం చాలా తేలిక. దీని కోసం 200 ఎమ్ ఎల్ కొబ్బరి నూనెను, 250 గ్రా. నువ్వులను తీసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో కొబ్బరి నూనెను తీసుకోవాలి. తరువాత ఇందులో నువ్వులను వేసి చిన్న మంటపై వేడి చేయాలి. ఈ నువ్వులు నల్లగా అయ్యే వరకు వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ నూనెను వడకట్టి ఒక గాజు సీసాలోకి తీసుకుని నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసిన నువ్వుల నూనెను వాడడం వల్ల మనం నల్లటి ఒత్తైన జుట్టును పొందవచ్చు. ఈ నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు పట్టించి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు సమస్యలు తగ్గి జుట్టు అందంగా, కాంతివంతంగా తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు.