Veg Biryani : మనం చికెన్, మటన్ వంటి వాటితోనే కాకుండా కూరగాయలతో కూడా బిర్యానీ తయారు చేస్తూ ఉంటాం. వెజ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ వెజ్ బిర్యానీని సులభంగా, రుచిగా, చాలా తక్కువ సమయంలో కూడా తయారు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్, వంటరాని వారు కూడా తేలికగా చేసేలా ఈ వెజ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కకావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెజ్ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బాస్మతి బియ్యం – 4 టీ గ్లాసులు, నీళ్లు – 6 టీ గ్లాసులు, తరిగిన బంగాళాదుంప – 1, తరిగిన క్యారెట్ – 1, తరిగిన బీన్స్ – అర కప్పు, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, నానబెట్టిన మీల్ మేకర్ – అర కప్పు, పచ్చి బఠాణీ – పావు కప్పు, తరిగిన పుదీనా – కొద్దిగా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పచ్చిమిర్చి – 4, జీడిపప్పు పలుకులు – కొద్దిగా, నూనె – 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టీ స్పూన్ లేదా తగినంత, బిర్యానీ మసాలా – రెండు టీ స్పూన్స్, పెరుగు – అర కప్పు.
మసాలా దినుసులు..
బిర్యానీ ఆకులు – 2, దాల్చిన చెక్క ముక్కలు – 2, సాజీరా – ఒక టీ స్పూన్, యాలకులు – 4, లవంగాలు – 4, అనాస పువ్వులు – 2.
వెజ్ బిర్యానీ తయారీ విధానం..
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడగాలి. తరువాత నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టాలి. తరువాత ఒక కుక్కర్ లో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. ఇవి వేడయ్యాక మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తరువాత కారం, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత పెరుగు వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత కూరగాయ ముక్కలు, మీల్ మేకర్, జీడిపప్పు వేసి కలపాలి. తరువాత ఉప్పు, కొత్తిమీర, పుదీనా కూడా వేసి కలపాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత నానబెట్టుకున్న బియ్యం నీటితో సహా వేసి కలపాలి.
తరువాత దీనిపై మూత పెట్టి పెద్ద మంటపై 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మూత తీసి అంతా ఒకసారి కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ బిర్యానీ తయారవుతుంది. దీనిని రైతా, మసాలా కూరలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో లేదా నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా వెజ్ బిర్యానీని తయారు చేసుకుని తినవచ్చు. దీనిని ఇంట్లో వాళ్లు ఇంకా కావాలని అడిగి మరీ ఇష్టంగా తింటారు.