Belly Fat : మనం ఆహారంగా బంగాళాదుంపలను కూడా తీసుకుంటాం. బంగాళాదుంపలతో వివిధ రకాల వంటకాలను వండుకుని తింటూ ఉంటాం. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. బంగాళాదుంపలలో కూడా మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. అయితే బంగాళాదుంపలలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయని వీటిని తింటే బరువు పెరుగుతారన్న సంగతి మనకు తెలిసిందే. బరువు పెరగడంలోనే కాదు బరువు తగ్గడంలో కూడా బంగాళాదుంప మనకు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
బంగాళాదుంప బరువు తగ్గించడమేంటి అని మనలో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. క్యాలరీలు ఎక్కువగా ఉండే బంగాళాదుంపలను తింటే బరువు పెరుగుతామని చాలా మంది అపోహపడుతుంటారు. బంగాళాదుంపలు బరువు తగ్గిస్తాయని అనగానే వీటితో చేసిన చిప్స్, ఫ్రైస్ తింటే బరువు తగ్గరు. వీటిని తింటే కచ్చితంగా బరువు పెరుగుతారు. బంగాళాదుంపలను నూనెలో వేయించడం వల్ల వాటిలో క్యాలరీలు పెరుగుతాయి. దాంతో అవి బరువు పెరిగేలా చేయడంతోపాటు ఆరోగ్యానికి కూడా హాని చేస్తాయి.
బరువు తగ్గాలంటే బంగాళాదుంపలను ఆరోగ్యవంతమైన రీతిలో తీసుకోవాలి. శరీరంలో అధిక కొవ్వు చేరడం వల్ల ఊబకాయం, అధిక రక్తపోటు, షుగర్ వ్యాధి, కీళ్ల నొప్పులు, హార్మోన్లలో అసమతుల్యతలు వంటి మొదలగు వ్యాధులకు దారి తీస్తుంది. కనుక మనం సాధ్యమైనంత త్వరగా అలాగే ఆరోగ్యవంతంగా బరువు తగ్గాలి. అధిక బరువుతో బాధపడే వారు బంగాళాదుంపలను ఏవిధంగా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బంగాళాదుంపలను మెత్తగా ఉడికించి పైన పొట్టు తీసేసి అలాగే తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా బరువు తగ్గుతారు. అలాగే రెండు బంగాళా దుంపలను శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసి జార్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిలో తగినన్ని నీళ్లు పోసి జ్యూస్ గా చేసుకోవాలి. ఇలా బంగాళాదుంపలతో చేసిన జ్యూస్ ను తాగడం వల్ల కూడా చక్కటి ఫలితం ఉంటుంది. అలాగే ఉడికించిన బంగాళాదుంపను ముందుగా మెత్తగా చేసుకోవాలి. దీనిని ఒక అర కప్పు పెరుగులో వేసి కలపాలి. దీనిని భోజనం చేసిన తరువాత తీసుకోవడం వల్ల చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు.
ఇలా పెరుగు, బంగాళాదుంప మిశ్రమాన్ని తీసుకున్న తరువాత ఎటువంటి ఆహారాలను తీసుకోకూడదు. ఈ విధంగా బంగాళాదుంపలను తీసుకోవడం వల్ల కచ్చితంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.