Tamarind Juice For Constipation : మనల్ని వేధించే జీర్ణ సంబంధిత సమస్యల్లో మలబద్దకం సమస్య కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో చాలా మంది ఈ సమస్య బారిన పడుతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మలబద్దకం సమస్య తలెత్తడానికి అనేక కారణాలు ఉంటాయి. నీటిని తక్కువగా తాగడం, ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, అలాగే ఇతర అనారోగ్య సమస్యలకు మందుల వాడడం, వయసు మీద పడడం, మానసిక ఒత్తిడి అలాగే మారిన మన జీవన విధానం, ప్రేగుల్లో కదలికలు సరిగ్గా లేకపోవడం వంటి అనేక కారణాల చేత ఈ సమస్య తలెత్తుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలల్లో కూడా ఈ సమస్య తలెత్తుతుంది. మలబద్దకం సమస్యే కదా అని దీనిని తేలికగా తీసుకుంటే మనం భవిష్యత్తులో అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది.
మలబద్దకం కారణంగా ఫైల్స్, ఆకలి లేకపోవడం, రోజంతా నిరుత్సాహంగా ఉండడం, కడుపులో నొప్పి, గ్యాస్, కోపం, చిరాకు, తలనొప్పి, కడుపు ఉబ్బరం వంటి అనేక ఇతర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. చాలా మంది ఈ సమస్య బారిన పడగానే మందులను ఉపయోగిస్తూ ఉంటారు. అసలు ఈ మందులు మలబద్దకాన్ని నివారించడంలో ఏ విధంగా ఉపయోగపడతాయి అలాగే మందులను వాడడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్దకం సమస్య నుండి బయటపడడానికి కొన్ని రకాల పొడులను నీటిలో కలుపుకుని తాగుతారు. ఇలా తాగడం వల్ల ప్రేగుల్లో మలం ఎక్కువగా తయారవుతుంది. దీంతో మలం సులభంగా బయటకు వస్తుంది.
అలాగే కొన్ని రకాల మందులు మన శరీరంలో ఉండే నీటిని మలం ప్రేగుల్లోకి వచ్చేలా చేస్తాయి. శరీరంలో ఉన్న నీరు మలం ప్రేగుల్లోకి వచ్చే సరికి విరోచనం సులభంగా జరుగుతుంది. ఇలా విరోచనం అవ్వడం వల్ల మలంతో పాటు ప్రేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా, విటమిన్స్, మినరల్స్ , నీరు కూడా బయటకు వస్తుంది. అలాగే కొన్ని రకాల మందులు గట్టిగా ఉన్న మలాన్ని మెత్తగా చేస్తాయి. దీంతో సుఖ విరోచనం అవుతుంది. అలాగే మరికొన్ని రకాల మందులు ప్రేగుల్లో కదలికలను పెంచుతాయి. ఇలా కదలికలను పెంచడం వల్ల విరోచనం జరుగుతుంది. అయితే ఇలా మందులను వాడడం వల్ల మనం అనేక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇలా మందులను వాడడం వల్ల శరీరం డీ హైడ్రేషన్ బారిన పడుతుంది.
అలాగే కడుపులో నొప్పి, అసౌకర్యం ఎక్కువగా ఉండడం, గ్యాస్ వంటి ఇతర సమస్యలు తలెత్తుతాయి. కనుక వీటిని వాడకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మన జీవన విధానంలో మార్పు చేసుకోవడం, నీటిని ఎక్కువగా తాగడం, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటివి చేయాలి. అదే విధంగా చింతపండు రసంలో, ఇంగువ, పసుపు, మిరియాల పొడి కలుపుకుని తాగినా కూడా సుఖ విరోచనం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. మలబద్దకం సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు ఎనీమా ఒక్కటే సరైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.