Black Hair : జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుత కాలంలో మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఆందోళన, వాతావరణ కాలుష్యం వంటి వివిధ కారణాల చేత మనలో చాలా మంది వివిధ రకాల జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు రాలడం, జుట్టు తెలబడడం, చుండ్రు, జుట్టు పెరగకపోవడం, జుట్టు పొడిబారడం, జుట్టు నిర్జీవంగా మారడం వంటి వాటిని మనం జుట్టు సంబంధిత సమస్యలుగా చెప్పవచ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో దొరికే జుట్టు సంబంధితమైన వాటన్నింటిని ఉపయోగిస్తూ ఉంటారు.
ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం మన ఇండ్లల్లో సహజ సిద్దంగా లభించే కలబందను ఉపయోగించి మనం జుట్టు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. జుట్టు రాలడాన్ని తగ్గించడంలో, చుండ్రు సమస్యను నివారించడంలో, జుట్టును మృదువుగా చేయడంలో కలబంద మనకు ఎంతో ఉపయోగపడుతుంది. అయితే కలబందను ఏ విధంగా ఉపయోగించడం వల్ల మనం చక్కటి అందమైన, ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారు కలబందతో నూనెను తయారు చేసుకుని వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ నూనెను తయారు చేసుకోవడానికి గానూ మనం పావు లీటర్ కొబ్బరి నూనెను, ఒక పెద్ద ముక్క కలబందను ఉపయోగించాల్సి ఉంటుంది.
ముందుగా ముదురుగా ఉండే పెద్ద ముక్క కలబందను తీసుకోవాలి. కలబందను కట్ చేయగానే దాని నుండి పచ్చ సొన వస్తుంది. ఈ సొన అంతా పోయే వరకు కలబందను శుభ్రంగా కడగాలి. తరువాత దానిని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొబ్బరి నూనెను తీసుకోవాలి. ఇందులో కలబంద ముక్కలను వేసి వేడి చేయాలి. ఈ నూనెను కలుపుతూ చిన్న మంటపై 5 నుండి 6 నిమిషాల పాటు వేడి చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. కలబందలోని గుణాలు నూనెలోకి దిగి నూనె రంగు మారడాన్ని మనం గమనించవచ్చు. ఈ నూనెను పూర్తిగా చల్లారే వరకు అలాగే ఉంచాలి.
తరువాత దానిని వడకట్టుకుని ప్లాస్టిక్ డబ్బాలో లేదా గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కలబంద నూనె తయారవుతుంది. దీనిని రోజూ జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు సమస్యలు తగ్గుతాయి. ఈ నూనెను రోజూ ఉపయోగించే సమయం లేని వారు వారానికి రెండు సార్లు నూనెను గోరు వెచ్చగా చేసి జుట్టు కుదుళ్లకు పట్టించాలి. ఈ విధంగా కలబందతో నూనెను తయారు చేసుకుని వాడడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు తెల్లబడకుండా ఉంటుంది. చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టు మెత్తగా, మృదువుగా, ఆరోగ్యంగా తయారవుతుంది.