Gas Trouble : మనలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యలలో కడుపులో గ్యాస్ సమస్య కూడా ఒకటి. ఈ సమస్య రావడానికి చాలా కారణాలు ఉంటాయి. సమయానికి భోజనం చేయకపోవడం, అజీర్తి, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, మలబద్దకం, గ్యాస్ ను ఎక్కువగా ఉత్పత్తి చేసే ఆహార పదార్థాలను తినడం వంటి వాటి వల్ల కడుపులో గ్యాస్ సమస్య ఉత్పన్నమవుతుంది. కడుపులో గ్యాస్ సమస్య వల్ల కలిగే బాధ అంతా ఇంతా కాదు. ఈ సమస్య నుండి బయట పడడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బయట దొరికే సిరప్ లను తాగడం, పొడులను నీళ్లలో కలుపుకుని తాగడం వంటి వాటిని చాలా మంది చేస్తుంటారు. వీటి వల్ల తాత్కాలిక ప్రయోజనం మాత్రమే ఉంటుంది. పైగా వీటిని వాడడం వల్ల దుష్పభ్రావాలు కూడా అధికంగా ఉంటాయి.
వీటిని తాగడం వల్ల పేగులలో ఉండే పొరలు దెబ్బ తినే అవకాశం కూడా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటిని వాడడానికి బదులుగా కేవలం ఇంటి చిట్కాలను ఉపయోగించి ఎటువంటి దుష్పభ్రావాలు లేకుండా మనం కడుపులో గ్యాస్ సమస్య నుండి బయటపడవచ్చు. ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు గాలిని ఎక్కువగా పీలుస్తూ వాకింగ్ చేయడం వల్ల కడుపులో ఉండే గ్యాస్ బయటకు పోతుంది.
నీటిలో పుదీనా ఆకులను, అల్లాన్ని వేసి మరిగించి ఈ నీటిని తాగడం వల్ల కూడా ఈ సమస్య నుండి బయట పడవచ్చు. మనకు బయట అల్లం మురబ్బా దొరుకుతూనే ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం దీనిని కొద్ది పరిమాణంలో తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ సమస్య రాకుండా ఉంటుంది. ఒక ప్లేట్ లో జీలకర్రను తీసుకుని, జీలకర్ర మునిగే వరకు సమానమైన మోతాదులో నిమ్మరసం, అల్లం రసాన్ని పోసి ఎండబెట్టాలి. నీరు అంతా ఆవిరి అయిపోయి జీలకర్ర ఎండిన తరువాత దీనిని పొడిగా చేసి తడి లేని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా నిల్వ చేసుకున్న పొడిని రోజూ అర టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ నీటిలో కలిపి తాగడం వల్ల కడుపులో గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.
మనం తయారు చేసే వంటకాలలో శొంఠి పొడిని ఉపయోగించడం వల్ల ఈ సమస్య తగ్గడంతోపాటు మనం తిన్న ఆహారం కూడా త్వరగా జీర్ణమవుతుంది. జీలకర్రను వేయించి పొడిగా చేసి ఆ పొడిని ఒక గ్లాస్ మజ్జిగలో కలుపుకుని తాగడం వల్ల కడుపులో సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వారానికి ఒక్కసారి ముద్ద ఇంగువను కొద్దిగా వేడి చేసి చిన్న మాత్ర పరిమాణంలో తీసుకుంటూ ఉండడం వల్ల కూడా గ్యాస్ సమస్య తగ్గు ముఖం పడుతుంది.
అల్లం రసాన్ని, తేనెను కలిపి ఉదయం పూట తీసుకుంటూ ఉండడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. జీలకర్ర ఒక స్పూన్, సోంపు రెండు స్పూన్లు, వాము అర టీస్పూన్ చొప్పున తీసుకుని చూర్ణంగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని రోజూ భోజనం చేసిన తరువాత ఒక చిటికెడు తింటూ ఉండడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమై అజీర్తి సమస్య రాకుండా ఉంటుంది. తద్వారా గ్యాస్ సమస్య తగ్గుతుంది. సమయానికి భోజనం చేయడం, త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం, కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు ఆహారాన్ని తీసుకోవడం వంటివి చేయడం వల్ల కూడా గ్యాస్ సమస్య రాకుండా ఉంటుంది.