Jock Itch : సాధారణంగా రోజులో ఎక్కువ భాగం నడిచే వారికి, శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారికి, చెమట ఎక్కువగా పట్టేవారికి తొడలు రాసుకుని మంట పుట్టడమో, ఆ ప్రదేశంలో నల్లగా లేదా ఎర్రగా కందిపోవడమో జరుగుతూ ఉంటుంది. దీనికి తోడు ఆ ప్రదేశంలో మంటగా, దురదగా కూడా ఉంటుంది. ఎండాకాలంలో ఈ సమస్య మరీ ఎక్కువగా బాధిస్తుంది. కొంతమందికి మాత్రం ఈ ఇబ్బంది తరచూ వస్తూనే ఉంటుంది. స్త్రీ, పురుషుల భేదం లేకుండా అందరినీ ఈ సమస్య ఇబ్బంది పెడుతుంది. అయితే చాలా మంది ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. కొన్ని రకాల చిట్కాలను పాటించడం వల్ల తొడలు రాసుకోవడం అనే సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు.
తొడలు రాసుకుపోయి మంటగా ఉన్నప్పుడు వాసిలిన్ లేదా బాడీ గ్లైడ్ వంటి వాటిని మంటపుడుతున్న ప్రదేశంలో రాసుకోవడం వల్ల మంటతోపాటు దురద కూడా తగ్గుతుంది. అంతేకాకుండా వాసిలిన్ ను రాసుకోవడం వల్ల తొడలు రాసుకోవడం అనే సమస్య కూడా తగ్గుతుంది. అలాగే టాల్కం పౌడర్, రోల్ ఆన్ డియో వంటి వాటిని సమస్య ఉన్న ప్రదేశంలో రాయడం వల్ల ఇబ్బంది తొలగిపోతుంది. మంట, దురద కూడా తగ్గుతాయి. బయటకు వెళ్లేటప్పుడు ముందుగానే వీటిని రాసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. స్త్రీలకు స్టాకింగ్స్ వంటి దుస్తులు అందుబాటులో ఉన్నాయి. వీటిని ధరించడం వల్ల తొడలు రాసుకునే సమస్య నుండి బయటపడవచ్చు.
తొడలు రాసుకుపోయి మంటగా ఉన్నప్పుడు ఒక వస్త్రంలో ఐస్ క్యూబ్స్ ను వేసి మూట కట్టి సమస్య ఉన్న ప్రదేశంలో 5 నిమిషాల పాటు ఉంచాలి. కొంత సమయం ఆగిన తరువాత మరలా అలాగే చేయాలి. వీలైనన్ని సార్లు ఇలా చేయడం వల్ల సమస్య ఉండి ఉపశమనం లభిస్తుంది. కలబంద గుజ్జును మంట పుడుతున్న భాగంలో రాయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. తొడలు రాసుకుపోయి ఇబ్బందిగా ఉన్నప్పడు ఒక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల నీళ్లను తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 3 చుక్కల లవంగం నూనెను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తొడలు రాసుకునే చోట రాయాలి.
5 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల మంట, దురద వంటి సమస్యలు తగ్గుతాయి. స్నానం చేసిన తరువాత కొద్దిగా ఆలివ్ నూనెను తీసుకుని తొడలు రాసుకునే చోట రాయాలి. ఆయిల్ పోయిందనుకుంటే మరింత కొంత నూనెను తీసుకుని మరలా రాయాలి. రోజులో ఇలా వీలైనన్ని సార్లు చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. మంట, దురదగా ఉన్న ప్రాంతాల్లో కొబ్బరి నూనెను రాసినా కూడా సమస్య నుండి బయట పడవచ్చు. ఈ జాగ్రత్తలను పాటిస్తూనే తొడల్లో ఉన్న కొవ్వు కరిగేలా వ్యాయామం చేయాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల తొడలు రాసుకోవడం వల్ల కలిగే ఇబ్బందుల నుండి బయట పడవచ్చు.