Garlic Curry : ఎన్నో ఔషధ గుణాలు ఉన్న వెల్లుల్లి ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటుంది. దీనిని మనం వంటల తయారీలో ఉపయోగిస్తూ ఉంటాం. వెల్లుల్లిని వాడడం వల్ల వంటల రుచి పెరగడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఇతర వంటకాలలో వాడడంతోపాటు వెల్లుల్లితో కూడా మనం కూరను తయారు చేసుకోవచ్చు. వెల్లుల్లితో చేసే కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. వెల్లుల్లితో కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లి కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు – పావు కంటే కొద్దిగా ఎక్కువ, ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, నానబెట్టిన చింతపండు – కొద్దిగా, నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – 1 లేదా 2 టీ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, నీళ్లు – అర కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
వెల్లుల్లి కూర తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టుకున్న చింతపండును వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి రంగు మారే వరకు వేయించాలి. తరువాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలిపి 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత నీళ్లు పోసి కలిపి మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.
చివరగా కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి కూర తయారవుతుంది. ఈ కూరను అన్నం, చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కూరను తినడం వల్ల మనం వెల్లుల్లిని ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా వంట చేసే సమయం లేనప్పుడు ఇలా వెల్లుల్లితో ఎంతో రుచిగా ఉండే కూరను తయారు చేసుకోవచ్చు.