UPI Wrong Payment : ప్రస్తుత తరుణంలో డిజిటల్ లావాదేవీల సంఖ్య పెరిగిపోయింది. చాలా మంది నగదుకు బదులుగా ఆన్‌లైన్‌లోనే పేమెంట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ వాడకం ఎక్కువైంది. అయితే అంతా బాగానే ఉంది కానీ.. మనం ఒకవేళ పొరపాటున ఎవరికైనా తప్పుగా డబ్బును పంపితే అప్పుడు ఆందోళన చెందుతాం. ఆ డబ్బు వెనక్కి వస్తుందో, రాదోనని కంగారు పడతాం. అయితే ఇప్పుడు చెప్పబోయే పలు స్టెప్స్‌ను పాటించడం వల్ల మీ డబ్బును మీరు 48 నుంచి 72 గంటల్లో వెనక్కి రప్పించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
మీరు ఏదైనా యూపీఐ యాప్ ద్వారా ఎవరికైనా డబ్బును పొరపాటుగా పంపితే ముందుగా మీరు సదరు యూపీఐ యాప్ వారికి కస్టమర్ కేర్‌కు కాల్ చేసి వివరాలను అందించాలి. అలాగే మీ బ్యాంకు వారికి కూడా సమాచారం ఇవ్వాలి. అయితే కొన్ని బ్యాంకులు ఈ-మెయిల్ ద్వారా కూడా ఈ ఫిర్యాదులను స్వీకరిస్తాయి. కనుక మీరు ఈ-మెయిల్ ద్వారా కూడా మీ సమస్యపై బ్యాంకుకు ఫిర్యాదు చేయవచ్చు. దీంతో వారు మీ సమస్యను పరిష్కరిస్తారు. ఈ-మెయిల్‌లో మీరు చేసిన ట్రాన్సాక్షన్ తాలూకు పూర్తి వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.
ఎన్‌పీసీఐ వెబ్‌సైట్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చు..
ఇక మీరు యూపీఐ ద్వారా తప్పుగా పేమెంట్ పంపిస్తే 18001201740 అనే టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి కూడా మీ ఫిర్యాదును నమోదు చేయవచ్చు. ఇక NPCI అధికారిక వెబ్‌సైట్‌లోనూ మీరు మీ ఫిర్యాదును రిజిస్టర్ చేయవచ్చు. దీంతో వారు మీ సమస్యను పరిష్కరిస్తారు. ఫిర్యాదు చేసే సమయంలో మీరు చేసిన యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడీ, వర్చువల్ పేమెంట్ అడ్రస్, ట్రాన్స్‌ఫర్ చేసిన మొత్తం, తేదీ, సమయం, ఈ-మెయిల్, ఫోన్ నంబర్ వంటి పూర్తి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దీని వల్ల మీ డబ్బులు త్వరగా వెనక్కి వచ్చే అవకాశాలు ఉంటాయి.
ఇక మీరు ఎవరికైతే తప్పుగా డబ్బును పంపారో వారి ఫోన్ నంబర్‌ను కనుక మీరు యూపీఐ యాప్‌లో గుర్తిస్తే వారికే నేరుగా మీరు కాల్ చేయవచ్చు. మీరు డబ్బును తప్పుగా పంపారని చెబుతూ ఆ మొత్తాన్ని మళ్లీ వెనక్కి పంపాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు. అయితే వారు గనక మీ రిక్వెస్ట్‌కు స్పందించకుండా డబ్బులు వెనక్కి ఇవ్వకపోతే అప్పుడు మీరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. దీంతో పోలీసులు తగిన చర్య తీసుకుంటారు. అప్పుడు మీకు మీ డబ్బులు వెనక్కి వస్తాయి. అయితే ఇది సైబర్ క్రైమ్ కిందకు వస్తుంది కనుక మీరు పోలీస్ స్టేషన్‌లోనూ సైబర్ క్రైమ్ వారికి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. దీంతో వారు మీ కంప్లెయింట్ తీసుకుని అవతలి వ్యక్తి నుంచి మీకు డబ్బులను వెనక్కి ఇప్పిస్తారు. ఇలా ఈ సందర్భాల్లో వ్యవహరించాల్సి ఉంటుంది. దీంతో మీ డబ్బును మీరు సురక్షితంగా వెనక్కి పొందవచ్చు.