సాధారణంగా బ్యాంకుల్లో ఉండే లాకర్లను ఎవరైనా ఎందుకు వాడుకుంటారు..? విలువైన వస్తులు, పత్రాలు, ఆభరణాలు లేదంటే నగదు వంటివి ఉంటే లాకర్‌లో అయితే సేఫ్‌గా ఉంటాయని ఎవరైనా వాటిని లాకర్లలో దాస్తారు. అందుకు గాను లాకర్ సైజ్‌ను బట్టి బ్యాంకులు ఏడాదికి ఇంత అని చార్జి వసూలు చేస్తాయి. అయితే ఇంత వరకు బాగానే ఉంది. మరి దురదృష్టవశాత్తూ లాకర్‌లో వినియోగదారుడు దాచుకున్న వస్తువులు పోతేనో..? అంటే.. అవును, ఆ వస్తువులు పోతే.. ఇంకేముందీ.. అందుకు ఆ బ్యాంకే బాధ్యత వహించాలి..! అంటారా..! అయితే మీరు పప్పులో కాలేసినట్టే. అవును, మీరు విన్నది నిజమే. అది ఎందుకంటే…
లాకర్ సేవలను అందించే విషయంలో బ్యాంకులు అనుసరిస్తున్న పద్ధతులపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆరోపణలు చేసింది. దీంతో కుష్ కల్రా అనే న్యాయవాది సమాచార హక్కు చట్టం కింద ఆర్‌బీఐని గతంలో పలు విషయాలు అడిగారు. ఈ క్రమంలో ఆర్‌బీఐ నుంచి వచ్చిన సమాధానాలు విని ఆయన షాక్ అయ్యారు. వాటిలో ఏముందంటే… వినియోగదారులు బ్యాంకుల్లో ఉండే లాకర్లలో ఏవైనా దాచుకోవాలనుకుంటే అప్పుడు బ్యాంకు వారు సంతకాలు తీసుకునే పత్రాలను సరిగ్గా చూసుకోవాలట. ఆ పత్రాల్లో సూచనలు, హెచ్చరికలు వంటి వాటిని జాగ్రత్తగా చదువుకోవాలట. ఆ తరువాతే ఏ వస్తువునైనా లాకర్‌లో దాచుకోవాలట. అలా కాకుండా వస్తువులను లాకర్‌లో దాచుకుని ఆ తరువాత ఒక వేళ అవిపోతే అందుకు బ్యాంకులు ఏవీ చేయలేవట. అంతా పూర్తిగా వినియోగదారుడిదే బాధ్యతనట.
ఈ సమాధానాలను విన్న కుష్ కల్రా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న బ్యాంకులన్నీ కూడబలుక్కుని ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాయని, దీన్ని ఎప్పటి నుంచో అమలు చేస్తున్నాయని, కానీ చాలా మంది వినియోగదారులకు దీని గురించి తెలియదని ఆయన అన్నారు. బ్యాంకులు అనుసరిస్తున్న ఈ విధానం సరైంది కాదని, పూర్తిగా అనుచితమైందని ఆయన మండిపడ్డారు. కనుక వినియోగదారులు ఏవైనా బ్యాంకుల్లో ఉండే లాకర్లలో వస్తువులను దాచుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని చెబుతున్నారు..! కాబట్టి జాగ్రత్త. బ్యాంకు లాకర్లలో విలువైన వస్తువులను దాస్తే, ఒక వేళ అవి చోరీకి గురైతే ఇక అందుకు బ్యాంకులు బాధ్యత వహించవు. కనుక ఈ విషయంలో ఎవరైనా జాగ్రత్త పడితే బెటర్. లేదంటే వస్తువులు పోయాక బాధపడీ ప్రయోజనం ఉండదు.