PPF Scheme : డబ్బు సంపాదించే ప్రతి ఒక్కరూ నెల నెలా ఎంతో కొంత పొదుపు చేయాలని చూస్తుంటారు. దాంతో పిల్లలు పెద్దయ్యాక వారి అవసరాలకు ఆ డబ్బు పనికొస్తుంది. అలాగే డబ్బు పొదుపు చేస్తే రిటైర్మెంట్ తీసుకున్నాక కూడా ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు. అందుకనే చాలా మంది తాము సంపాదించే డబ్బును పొదుపు చేస్తుంటారు. ఇక డబ్బును పొదుపు చేసేందుకు మనకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఎవరికి తగినట్లు వారు ఎవరికి నచ్చిన విధంగా వారు తమ డబ్బులను పొదుపు చేస్తుంటారు. అయితే అలాంటి మార్గాల్లో పీపీఎఫ్ స్కీమ్ కూడా ఒకటని చెప్పవచ్చు. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కనుక ఇందులో మనం పొదుపు చేసుకునే డబ్బుకు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం రక్షణగా ఉంటుంది.
ఇక పీపీఎఫ్ స్కీమ్‌ను ఎవరైనా ప్రారంభించవచ్చు. ఇందులో చిన్న మొత్తంలో పొదుపు చేసినా చాలు.. దీర్ఘకాలంలో పెద్ద ఎత్తున లాభం పొందవచ్చు. పీపీఎఫ్ స్కీమ్‌ను బ్యాంకులు లేదా పోస్టాఫీసులోనూ ప్రారంభించవచ్చు. ఇందులో పొదుపు చేసే మొత్తానికి వచ్చే ఆదాయంపై పన్ను మినహాయింపు ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద పీపీఎఫ్ స్కీమ్ రాబడిపై పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇందులో కనీసం రూ.500 నుంచి డబ్బు పొదుపు చేయవచ్చు.
పీపీఎఫ్ స్కీమ్‌లో భాగంగా కనిష్టంగా రూ.500 పొదుపు చేసుకోవచ్చు. గరిష్టంగా అయితే ఏడాదికి రూ.1.50 లక్షలను పెట్టుబడిగా పెట్టవచ్చు. ఇక ఈ స్కీమ్ మెచూరిటీ 15 ఏళ్లు. తరువాత మళ్లీ అవసరం అనుకుంటే మరో 5 ఏళ్ల పాటు రెండు సార్లు పెంచుకోవచ్చు. దీంతో మొత్తం 15+5+5=25 ఏళ్లు అవుతుంది. అయితే స్కీమ్ మెచూరిటీ అవడానికి ముందు దాన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 25 ఏళ్ల పాటు ఈ స్కీమ్‌లో కొనసాగవచ్చు.
పీపీఎఫ్ స్కీమ్‌లో భాగంగా ఎవరైనా ఒక వ్యక్తి నెలకు రూ.5వేలను పొదుపు చేస్తే 15 ఏళ్లకు పొదుపు మొత్తం రూ.9 లక్షలు అవుతుంది. దీనిపై ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ ఇస్తున్నారు. కనుక పొదుపు చేసిన మొత్తంపై రూ.7,27,284 వడ్డీ వస్తుంది. దీంతో 15 ఏళ్ల తరువాత మీ వద్ద రూ.16,27,284 ఉంటాయి. అయితే దీన్ని మరో 5 ఏళ్ల పాటు 2 సార్లు పొడిగిస్తే అప్పుడు మీవద్ద 25 ఏళ్ల అనంతరం మొత్తం రూ.42 లక్షలు ఉంటాయి. మీరు పొదుపు చేసిన దాని కన్నా వడ్డీయే ఎక్కువగా వస్తుంది. ఇలా ఇందులో నెలకు రూ.5వేలు పెట్టడం ద్వారా 25 ఏళ్ల అనంతరం మీరు రూ.42 లక్షలను పొందవచ్చు.
ఇక పీపీఎఫ్ స్కీమ్‌లో భాగంగా మీరు ఏడాది పాటు పెట్టుబడి పెడితే ఏడాది తరువాత అందులో నుంచి కొంత మొత్తం వరకు మీరు ఎమర్జెన్సీ ఫండ్ కింద వాడుకోవచ్చు. అలాగే 6 ఏళ్ల వరకు డబ్బు పొదుపు చేస్తే అప్పుడు మీరు అందులో 50 శాతం మొత్తాన్ని ఎమర్జెన్సీ కింద వాడుకోవచ్చు. ఇక 3 ఏళ్ల పాటు ఈ స్కీమ్‌లో డబ్బు పొదుపు చేస్తే మీరు ఆ మొత్తంపై లోన్ కూడా పొందవచ్చు. ఇలా పీపీఎఫ్ స్కీమ్‌తో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.