మన దేశంలోనే కాదు, ఎక్కడైనా ఓ పుకారు వచ్చిందంటే చాలు అది దావానలం కన్నా వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో ఒకానొక సందర్భంలో ఆ పుకారునే చాలా మంది నిజం అని నమ్ముతారు. ఇక ఇటీవలి కాలంలో సోషల్ మీడియా హల్‌చల్ ఎలా ఉందో తెలిసిందే. ఈ క్రమంలో ఎవరైనా ఏదైనా ఒక పుకారు సృష్టించారంటే చాలు కొన్ని నిమిషాలు, గంటల్లోనే అది వైరల్ అవుతోంది. అలా వైరల్‌గా మారిన టాపిక్ ఏంటంటే… అదేనండీ… రూ.10 నాణేలు… అవును, అవే. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా వీటిని తీసుకోవడం లేదు. కారణం వీటిని కూడా రద్దు చేశారని ప్రజలు నమ్ముతున్నారు.
అయితే ఇంతకీ అసలు రూ.10 నాణేలను నిజంగానే రద్దు చేశారా..? అంటే… లేదు, రద్దు చేసి ఉంటే ఈ పాటికి మీడియాలో వచ్చేదే..! ప్రభుత్వం అలా చేసిందేమిటి..? అంటూ చానళ్లు చర్చలు పెట్టేవి కదా. ఇక పత్రికల్లో అయితే ఆ విషయానికి సంబంధించి పుంఖాను పుంఖాలుగా వార్తలు వస్తాయి. అదేమీ లేదంటే… అబ్బే… చాన్సే లేదు. అసలు రూ.10 నాణేలను రద్దు చేయలేదు. మరెందుకు ప్రజలు ఆ నాణేలను తీసుకోవడం లేదు..? అంటే… ముందే చెప్పాం కదా… అటి వట్టి పుకారు మాత్రమేనని..!
కావాలంటే మీరు బ్యాంకులకు వెళ్లి చూడండి, అక్కడ రూ.10 నాణేలను తీసుకుంటారు. అవును, రూ.10 నాణేలు ఉన్నాయని ఎవరూ దిగులు పడకండి. ఎంచక్కా బ్యాంకుకు వెళ్లి వాటిని మార్చుకోండి. అలా అని మేం చెప్పడం లేదు, బ్యాంకులే చెబుతున్నాయి. ఈ మధ్య కాలంలో రూ.10 నాణేలపై వస్తున్న పుకార్లను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులన్నీ ఈ ప్రకటనను సంయుక్తంగా విడుదల చేశాయి. కనుక రూ.10 నాణేల విషయంలో ఎవరూ ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన పనిలేదు. నిరభ్యంతంరంగా తీసుకోవచ్చు. ఒక వేళ ఎవరైనా తీసుకోవడం లేదు అంటే.. అది వారి ఖర్మ… అంతే. అంతకు మించి ఇక చెప్పేదేం లేదు..!