అతడు సమోసాలు అమ్ముకుంటాడు, కానీ నేనంటాను అతను అతిపెద్ద ధనవంతుడు అని!!….ఇలా ఎందుకు చెబుతున్నానో తెలియాలంటే కెమెరా ఢిల్లీ లోని ఇండియా గేట్ వైపు ప్యాన్ చేయాల్సిందే. అక్కడ ఓ వ్యక్తి సమోసాలమ్ముకుంటున్నాడు. బాబూ సమోసా ఎంత? అనగానే పదికి రెండు సార్ అంటూ సమాధానం ఇచ్చాడు. సరే ఇదిగో అంటూ అతని చేతిలో కస్టమర్ 500 రూపాయల నోటు పెట్టి రెండు సమోసాలు తీసుకుపోయాడు. సార్ చిల్లర లేదు అంటున్నాడు ఆ సమోసాలమ్మే వ్యక్తి.
ఇంతలోనే ఆ కస్టమర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు..తన చేతిలోని 500 రూపాయల నోటు వైపు, అతని వైపు అదే పనిగా చూస్తున్నాడు ఆ సమోసాలమ్మే వ్యక్తి.. 500 రూపాయలు అతనికి రెండు రోజుల సంపాదన … చడీ చప్పుడు కాకుండా జేబులో వేసుకోవొచ్చు కానీ అతని మనసు దానికి అంగీకరించలేదు… వెంటనే అతనిని వెతుక్కుంటూ వెళ్లాడు. సార్ ఇదిగో మీ 500 రూపాయల నోటు… నాకు చేంజ్ ఇవ్వండి అన్నాడు, దానికి అతను పర్లేదు ఉంచుకో అన్నాడు.. వద్దు సార్ అంటూ ఇతని సమాధానం… పర్లేదులే తీసుకో… ఏం కాదు అని మరో మారు అతడన్నాడు.అయినప్పటికీ ఆ సమోసాలమ్మే వ్యక్తి ఆ 500 రూపాయల నోటును తీసుకోడానికి ససేమీరా అన్నాడు.
ఎంత అడిగినా ఆ డబ్బులు తీసుకోడానికి నిరాకరించిన ఆ సమోసాలమ్మే వ్యక్తి.. సార్ నేను కష్టపడి సంపాదించే డబ్బు నాకు చాలు, నిజంగా మీరు ఈ డబ్బు ఇవ్వాలనుకుంటే నాకన్నా ఎక్కువగా అవసరం ఉన్నవారికి ఇవ్వండి అంటూ సున్నితంగా తిరస్కరించాడు. అతడి మంచితనం చూసి ఆ వ్యక్తి సమోసాలమ్మే వ్యక్తిని గౌరవంతో ఆలింగనం చేసుకున్నాడు సదరు కస్టమర్. అంతే కాదు అతడి నిజాయితికీ రెండు మూడు సార్లు సెల్యూట్ కూడా చేశాడు. ఇప్పుడు చెప్పండి ఇతను అసలైన ధనవంతుడా కాదా? మంచి మనస్సున ధనవంతుడు… కష్టాన్ని నమ్ముకున్న ధనవంతుడు అని నేనంటాను…మరి మీరేమంటారు.