సన్యాసులు రోజంతా ధ్యానంలోనే ఉంటారు. ఆకలి వేసినప్పుడే భిక్షకు వెళతారు. అలా ఒక సన్యాసి తన శిష్యులతో కలిసి భిక్షకు వెళ్ళాడు. వీధిలో నడుచుకుంటూ వెళ్తూ ప్రతి ఇంటి దగ్గర ఆగుతూ భిక్ష అడుగుతున్నాడు. మొదటి ఇంట్లో ఇల్లాలు ఏమీ లేవు, వెళ్ళమని చెప్పింది. ఇక రెండో ఇంటికి వెళితే ఆమె ఒక అరటిపండును వేసింది. ఆ అరటిపండు కూడా సగం పాడై ఉంది. ఇక మూడో ఇంటికి వెళ్తే ఆమె గుప్పెడు బియ్యం పోసింది. నాలుగో ఇంటికి వెళితే ఆ ఇంటి ఇల్లాలు కోపంతో అంత ఎత్తున లేచి నానా తిట్లు తిట్టింది. ఇక ఐదో ఇంటికి వెళ్లారు సన్యాసులు. ఆ ఇంట్లోనే మహిళ రెండు గ్లాసుల బియ్యాన్ని వేసి వెళ్ళింది. ఇక ఆరో ఇంటికి వెళితే అక్కడున్న ఆమె కోపంతో ఊగిపోయింది. ఉత్తినే బియ్యం ఎవరు పోస్తారు, మేము కష్టపడి బతుకుతుంటే మీకు ఊరికే ఇవ్వాలా.. అంటూ తిట్టడం మొదలు పెట్టింది. సన్యాసులంతా చిరునవ్వుతో తిరిగి మఠానికి బయలుదేరారు.
వారికి దారి మధ్యలో ఒక ఆవు కనిపించింది. ఆ ఆవుకి ఒక ఇల్లాలు ఇచ్చిన అరటిపండును తినిపించారు. తిరిగి మఠానికి వచ్చి బిక్షగా వచ్చిన బియ్యాన్ని వండుకుని తిన్నారు. ఒక శిష్యుడు అన్నం తినకుండా చాలా బాధగా కనిపించాడు. వెంటనే గురువు వెళ్లి ఏమైందని అడిగాడు. దానికి ఆశిష్యుడు అన్ని తిట్లు, శాపనార్థాలు, కోపాలు ఎలా భరిస్తామని అడిగాడు. అవన్నీ గుర్తొచ్చి బాధనిపిస్తోందని చెప్పాడు. అన్నం కూడా తినాలనిపించడం లేదని చెప్పాడు. వెంటనే ఆ గురువు ఈరోజు మనము ఎన్ని ఇళ్లకు వెళ్ళాము? అని అడిగాడు. శిష్యుడు ఎనిమిది ఇళ్లకు వెళ్లామని చెప్పాడు. వెంటనే గురువు మనకు ఈరోజు ఏమేమి బిక్షగా వచ్చాయి? అని ప్రశ్నించాడు. దానికి ఆ శిష్యుడు ఒక అరటిపండు, బియ్యం బిక్షగా వచ్చాయని చెప్పాడు.
మనము మఠానికి ఏం తెచ్చుకున్నాం? అని అడిగాడు గురువు. దానికి ఆ శిష్యుడు అరటిపండును ఆవుకి పెట్టేసాము, కాబట్టి మఠానికి తీసుకురాలేదు, బియ్యం మాత్రమే తెచ్చుకొని తిన్నాము అని వివరించాడు. వెంటనే గురువు మనం తెచ్చుకున్న వాటిలో బియ్యమే ఉన్నాయి. తిట్లు, శాపనార్థాలు, కోపాలు, తాపాలు ఏమీ లేవు కదా… మరి ఎందుకు నువ్వు బాధపడుతున్నావు. ఆ కోపాలు, తాపాలు, శాపనార్థాలు, తిట్లు అన్నీ వారి దగ్గరే ఉండిపోయాయి. మనం బియ్యం మాత్రమే తెచ్చుకున్నాము. కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పాడు. శిష్యుడికి తత్వం అర్థమైంది. అప్పటి నుంచి నిజమైన సన్యాసిలా ఎవరి కోపాన్ని పట్టించుకోవడం మానేశాడు. తిట్లకు కూడా నవ్వునే సమాధానంగా ఇచ్చాడు.
కేవలం ఆ శిష్యుడు మాత్రమే కాదు మీరు కూడా జీవితంలో ఎదురైనా అవమానాలను తలుచుకొని పదేపదే బాధపడకండి. వాటిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటే కోపం, పగ, బాధ ఇవే కలుగుతాయి. ఎదుటివారు మిమ్మల్ని తిట్టిన తిట్లు మీవి కాదు. వారి నోట్లో నుంచి వచ్చినవి అంటే అవి వారివే. ఆ తిట్లు, కోపాలు, అవమానాలు మీతో పాటు రావు .అవి వారి దగ్గరే ఉండిపోతాయి. కాబట్టి మీరు బాధపడాల్సిన అవసరమే లేదు.