Railway Station : మన భారతీయ రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత పెద్దది. ఎన్నో లక్షల మంది ఉద్యోగులు ఇందులో పనిచేస్తున్నారు. రోజూ ఎన్నో కోట్ల మంది ఎన్నో వేల రైళ్ల ద్వారా ప్రయాణిస్తుంటారు. అయితే ఇంతటి భారీ వ్యవస్థలో ఒక రైల్వే స్టేషన్ గురించి మనం ప్రముఖంగా చెప్పుకోవాలి. అదే.. బెగన్ కొడార్ రైల్వే స్టేషన్. ఇది పశ్చిమ బెంగాల్‌కు, జార్ఖండ్‌కు మధ్య ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ వెనుక ఒక పెద్ద కథే ఉంది. దాన్ని చిన్నగా చెప్పుకుందాం.
1960లలో బెగన్ కొడార్ గ్రామంలో రైల్వే స్టేషన్ లేదు. ఇక్కడి ప్రజలు సుమారుగా 25 నుంచి 30 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తేనే గానీ స్టేషన్ రాదు. దీంతో వారికి రవాణా సౌకర్యానికి చాలా ఇబ్బందిగా ఉండేది. అయితే వారు అక్కడి రైల్వే అధికారులను బతిమాలి చివరకు ఒక స్టేషన్ వచ్చేలా చేశారు. దీంతో అక్కడ రైల్వే స్టేషన్ చకచకా నిర్మాణం అయిపోయింది. ఆ తరువాత అందులో 1968లో మోహన్ అనే ఒక స్టేషన్ మేనేజర్‌ను నియమించారు.
ఈ క్రమంలోనే ఒక రోజు రాత్రి ఆయన రైలు పట్టాల పక్కన రైలు వెంబడే వేగంగా పరుగెత్తుతున్న ఓ అమ్మాయిని చూశాడు. దీంతో ఆమె ఆ రైలు మిస్ అయింది కాబోలు అని అనుకున్నాడు. తరువాత మరుసటి రోజు కూడా అలాగే జరిగింది. దీంతో ఆయనకు ఏదో అనుమానం వచ్చింది. అలా వరుసగా ప్రతి రోజూ రైలు పట్టాల పక్కన రైలు వెంబడి ఆమె పరుగెత్తడాన్ని ఆయన చూస్తూ వచ్చాడు. ఇక ఈ విషయం గురించి ఆ గ్రామస్థులకు, తన ఉన్నతాధికారులకు చెప్పాడు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఆయన మద్యం మత్తులో ఉన్నాడు కాబోలని అనుకున్నారు. చివరకు ఆయనకు ఒక వారం తరువాత తీవ్రంగా అనారోగ్య సమస్యలు వచ్చి చనిపోయాడు. అనంతరం ఆయన స్థానంలో ఇంకో స్టేషన్ మేనేజర్‌ను నియమించారు.
అయితే ఆ తరువాత వచ్చిన స్టేషన్ మేనేజర్ కూడా తనకు అలాంటి సంఘటననే ఎదురైందని చెప్పాడు. ఎందుకైనా మంచిదని అతను వెంటనే అక్కడ ఉద్యోగం చేయకుండా పారిపోయాడు. తరువాత ఎవరిని నియమించినా.. అందరూ పారిపోయారు. కానీ అక్కడ ఉద్యోగం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ నోటా ఈనోటా పడి ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. ఈ క్రమంలో ఆ స్టేషన్‌కు రైల్వే అధికారులు, సిబ్బంది.. ఆఖరికి ఆ గ్రామస్థులు రావడానికే భయపడేవారు. ముఖ్యంగా సాయంత్రం 5 దాటిందంటే చాలు.. ఆ చుట్టు పక్కల 10 కిలోమీటర్ల దూరంలో ఎవరూ ఉండేవారు కాదు. అత్యంత నిర్మానుష్యంగా.. భయంకరంగా ఉండేది.
ఆ తరువాత అక్కడ ఎవరూ పనిచేసేందుకు కూడా రాలేదు. అవసరం అయితే రాజీనామా చేస్తాం కానీ.. ఆ స్టేషన్‌లో పనిచేయబోమని స్పష్టం చేశారు. దీంతో రైల్వే శాఖ ఆ స్టేషన్‌ను మూసేసింది. ఇక అప్పటి నుంచి ఆ స్టేషన్ పాడుబడిపోయింది. ఆ తరువాత నుంచి సాయంత్రం 5 తరువాత మళ్లీ ఉదయం వరకు ఆ స్టేషన్ మీదుగా ఏ రైలు వెళ్లినా సరే.. అక్కడికి రాగానే రైలు వేగం పెంచడం మొదలు పెట్టారు. అలాగే ప్రయాణికులు కూడా ఆ స్టేషన్ వస్తుందంటే.. రైలు కిటికీలు, తలుపులు అన్నీ మూసివేయడం ప్రారంభించారు. దీంతో ఆ స్టేషన్ పేరు చెబితేనే భయపడేలా ఆ స్టేషన్ పేరుగాంచింది.
అయితే 2009లో కొందరు నిపుణులు ఆ స్టేషన్‌ను అన్ని రకాలుగా పరిశీలించారు. అక్కడ దెయ్యాలు ఏమీ లేవని.. అంతా బాగానే ఉందని తేల్చి చెప్పారు. దీంతో కొంత వరకు అందరికీ ధైర్యం వచ్చింది. ఆ తరువాత సీఎం మమతా బెనర్జీ ఆ స్టేషన్‌కు మరమ్మత్తులు చేయించి మళ్లీ ప్రారంభించారు. అయితే సాయంత్రం 5 దాటితే అక్కడ ఎవరూ ఉండరు. ఇప్పుడు ఆ స్టేషన్ టూరిస్ట్ కేంద్రంగా మారింది. దాన్ని చూసేందుకు చాలా మంది వెళ్తుంటారు.