మన శరీరంలో గుండె అత్యంత ముఖ్యమైన అవయవం. ఇది శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. రక్తనాళాల ద్వారా రక్తాన్ని పంప్ చేస్తుంది. అయితే రక్త నాళాలకు రక్తాన్ని సరిగ్గా పంప్ చేయలేకపోతే అలాంటి స్థితిని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. ఇది చాలా తీవ్రమైన సమస్య. ఇది ఉన్నవారిలో గుండె నుంచి రక్తం సరిగ్గా సరఫరా కాదు. దీంతో కాల క్రమేణా అది ప్రాణాంతక పరిస్థితులకు దారి తీస్తుంది.
హార్ట్ ఫెయిల్యూర్ తీవ్రతరం అయితే దాన్ని Acute Heart Failure లేదా Worsening Heart Failure అని పిలుస్తారు. ఈ స్థితిలో ఉన్న రోగులకు హాస్పిటల్‌లో అత్యవసర స్థితిలో చికిత్సను అందించాల్సి ఉంటుంది.
1. హార్ట్ ఫెయిల్యూర్ అయిన వారు శ్వాసను సరిగ్గా తీసుకోలేరు. శ్వాసను తీసుకోవడంలో సమస్యలు వస్తాయి. హార్ట్ ఫెయిల్యూర్ ఎక్కువ అయ్యే కొద్దీ శ్వాస పూర్తిగా ఆడకుండా పోతుంది. అందువల్ల శ్వాస సరిగ్గా ఆడడం లేదని తెలిసిన మరుక్షణమే స్పందించాలి. వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలి.
2. పడుకునేటప్పుడు తరచూ దగ్గు సమస్య వస్తుంటే అది హార్ట్ ఫెయిల్యూర్ లక్షణమే అయి ఉంటుందని అనుమానించాలి. ఊపిరితిత్తుల్లో ఫ్లుయిడ్స్ చేరడం వల్ల ఇలా దగ్గు వస్తుంది. తీవ్రతరం అయితే దగ్గినప్పుడు రక్తం కూడా పడుతుంది. ఈ స్థితిలో అత్యవసరంగా వైద్యం అందించాలి.
3. హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నవారికి తీవ్రమైన అలసట, నీరసం వస్తుంటాయి. చిన్న పని చేసినా లేదా అసలు పని ఏమీ చేయకపోయినా అలసట వస్తుందంటే అది హార్ట్ ఫెయిల్యూర్ లక్షణమేమోనని అనుమానించాలి. ఇలాంటి స్థితిలో గుండె రక్తాన్ని సరిగ్గా పంప్ చేయదు కనుక కండరాలకు తగినంత రక్తం అందదు. ఫలితంగా తీవ్రమైన అలసట, నీరసం వస్తాయి. అందువల్ల ఈ లక్షణాలు కనిపిస్తుంటే అశ్రద్ధ చేయరాదు. వెంటనే చికిత్స తీసుకోవాలి.
4. కాలి మడమల్లో కొందరికి వాపులు కనిపిస్తుంటాయి. ద్రవాలు ఎక్కువ కావడం వల్ల ఈ సమస్య వస్తుంటుంది. లేదా కిడ్నీలు పాడైనా ఇలాగే మడమలు వాపులకు గురవుతాయి. అయితే హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నవారిలోనూ మడమలు ఇలాగే కనిపిస్తాయి. కనుక డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని అసలు కారణం తెలుసుకోవాలి. దీంతో గుండెను సంరక్షించుకోవచ్చు.
5. ఉన్నట్లుండి అకస్మాత్తుగా కొద్ది రోజుల్లోనే కొందరు అధికంగా బరువు పెరుగుతారు. ఇలా గనక జరిగితే హార్ట్ ఫెయిల్యూర్ లక్షణం కావచ్చని అనుమానించాలి. చెక్ చేయించుకుని చికిత్స తీసుకోవాలి.
6. హార్ట్ ఫెయిల్యూర్ సమస్య ఉన్నవారిలో గుండె దడ వస్తుంటుంది. గుండె అసాధారణ రీతిలో వేగంగా కొట్టుకుంటుంది. కొన్ని సార్లు ఈ సమస్య కొందరికి పలు కారణాల వల్ల వచ్చి పోతుంటుంది. కానీ అదే పనిగా ఇలా జరుగుతుంటే అది హార్ట్ ఫెయిల్యూర్ ఏమోనని అనుమానించాలి.
7. హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నవారిలో జీర్ణాశం, పేగుల వద్ద ద్రవాలు ఎక్కువగా చేరుతాయి. దీంతో జీర్ణాశయం కుచించుకుపోయినట్లు అవుతుంది. ఫలితంగా కడుపు ఎల్లప్పుడూ నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆకలి వేయదు. ఇలా గనక ఉంటే హార్ట్ ఫెయిల్యూర్‌గా అనుమానించాలి. డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా తేడా అనిపిస్తే డాక్టర్ సూచన మేరకు మందులను వాడాలి. చికిత్స తీసుకోవాలి.
హార్ట్ ఫెయిల్యూర్ వల్ల కొందరికి వేగంగా అనారోగ్యం క్షీణిస్తుంది. అలాంటి వారిలోనూ పైన తెలిపిన లక్షణాలే కనిపిస్తాయి. అందువల్ల వాటిని గమనించి ముందుగానే చికిత్స తీసుకుంటే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. హార్ట్ ఎటాక్‌లు రాకుండా నివారించవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365