మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో రోజూ తగినంత నీటిని తాగడం అంతే ముఖ్యమని వైద్యులు చెబుతుంటారు. రోజూ కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగాల్సి ఉంటుంది. లేదా దాహం అయిన మేర నీటిని తాగాలి. కానీ కొందరు నీటిని ఎక్కువగా తాగుతుంటారు. నీటిని ఎక్కువగా తాగకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయోమోనన్న భయంతోనే వారు అలా చేస్తుంటారు. కానీ అలా నీటిని ఎక్కువగా తాగడం ప్రమాదకరం. దాంతోనూ అనారోగ్య సమస్యలు వస్తాయి.
1. నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో ద్రవాలు ఎక్కువగా చేరుతాయి. దీంతో శరీరంలో ద్రవాల పరిమాణం అదుపు తప్పుతుంది. ఉండాల్సిన దానికన్నా ఎక్కువ మొత్తంలో ద్రవాలు ఉంటాయి. దీంతో వికారం, వాంతులు వచ్చినట్లు ఉండడం, కండరాలు పట్టేయడం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.
2. నీటిని అసలు తాగకపోతే శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. దీంతో తలనొప్పి వస్తుంది. అయితే అవసరానికి మించి నీటిని తాగితే అప్పుడు శరీరం ఓవర్ హైడ్రేషన్ బారిన పడుతుంది. దీంతో రక్తంలో ఉప్పు శాతం తగ్గుతుంది. దీని వల్ల అవయవాల్లోని కణాలు వాపులకు గురవుతాయి.
3. అధికంగా నీటిని తాగితే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ లెవల్స్ తగ్గుతాయి. దీని వల్ల కండరాలు పట్టేస్తాయి. నొప్పులు వస్తాయి.
4. నీటిని అధికంగా తాగడం వల్ల కిడ్నీలపై అదనపు భారం పడుతుంది. ఎక్కువ నీటిని వడబోయాల్సి వస్తుంది. దీంతో కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. దీర్ఘకాలికంగా ఇలా జరిగితే కిడ్నీ సమస్యలు వస్తాయి.
5. నీటిని అధికంగా తాగితే శరీరంలో పొటాషియం లెవల్స్ తగ్గుతాయి. దీంతో కాళ్ల నొప్పులు, విసుగు, ఛాతి నొప్పి వస్తాయి.
6. నీటిని అధికంగా తాగితే మూత్ర విసర్జనకు ఎక్కువ సార్లు వెళ్లాల్సి వస్తుంది. దీర్ఘకాలికంగా ఇలా జరిగితే శరీరం ద్రవాలను శోషించుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంది. కనుక రోజూ తగినంత మోతాదులోనే నీటిని తాగాల్సి ఉంటుంది.