ఆయుర్వేదం ప్ర‌కారం నిత్యం 6 రుచుల ఆహారాల‌ను తీసుకోవాలి.. ఎందుకంటే..?

ఉగాది పండుగ రోజున స‌హ‌జంగానే చాలా మంది ఆరు రుచుల క‌ల‌యిక‌తో ఉగాది ప‌చ్చ‌డిని త‌యారు చేసుకుని తింటుంటారు. అయితే నిజానికి కేవ‌లం ఆ ఒక్క రోజు మాత్ర‌మే కాదు, నిత్యం ఆరు ర‌కాల రుచుల‌కు చెందిన ఆహారాల‌ను ప‌రిమితంగా తీసుకోవాల‌ని ఆయుర్వేదం చెబుతోంది. అవును.. నిత్యం ఆరు ర‌కాల రుచులు ఉండే ఆహారాల‌ను క‌చ్చితంగా తీసుకోవాలి. దీంతో మ‌నం ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. ఇక ఏయే రుచి ఉన్న ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ayurveda 6 tastes and their benefits in telugu

1. తీపి

శ‌రీరంలోని వాత‌, పిత్త దోషాల‌ను ఈ రుచి స‌మం చేస్తుంది. తీపి ఉన్న ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఆయుర్దాయం పెరుగుతుంది, శ‌రీరం దృఢంగా మారుతుంది. శ‌క్తి అందుతుంది. శ‌రీరంలో ద్ర‌వాలు స‌మతుల్యంలో ఉంటాయి. అయితే తీపి రుచి క‌లిగిన ఆహారాల‌ను చాలా త‌క్కువ‌గా తినాలి. లేదంటే శ‌రీరంలో క‌ఫ దోషం పెరుగుతుంది. ఫ‌లితంగా అధిక బ‌రువు, స్థూల‌కాయం, డ‌యాబెటిస్ వంటి వ్యాధులు వ‌స్తాయి. క‌నుక ఈ రుచి ఉన్న ఆహారాల‌ను నిత్యం త‌క్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

2. పులుపు

వాత దోషాల‌ను పులుపు త‌గ్గిస్తుంది. ఈ రుచి ఉన్న ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల ఆక‌లి పెరుగుతుంది. జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. నిమ్మ‌, చింత‌కాయ వంటి పులుపు ఉన్న ఆహారాల‌ను నిత్యం ప‌రిమితంగా తీసుకోవ‌చ్చు. అయితే ఎక్కువ‌గా తీసుకుంటే పిత్త‌, క‌ఫ దోషాలు పెరుగుతాయి. క‌న‌క పులుపు ఆహారాల‌ను కూడా త‌క్కువ‌గా తీసుకోవాలి.

3. ఉప్పు

ఉప్పు ఉన్న ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల వాత దోషం త‌గ్గుతుంది. ఉప్పు అధికమైతే పిత్త‌, క‌ఫ దోషాలు పెరుగుతాయి. ఉప్పు ఉన్న ఆహారాల వ‌ల్ల జీర్ణ శ‌క్తి పెరుగుతుంది. క‌ణాలు శుభ్రమ‌వుతాయి. ఉప్పు ఉన్న ప‌దార్థాల‌ను కూడా త‌క్కువ‌గా తీసుకోవాలి. ఎక్కువైతే బీపీ పెరుగుతుంది. గుండె జ‌బ్బులు వ‌స్తాయి.

4. కారం

ఈ రుచి ఉన్న ఆహారాల‌ను తీసుకుంటే జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. ఆక‌లి వేస్తుంది. క‌ణాలు శుభ్ర‌మ‌వుతాయి. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. క‌ఫ దోషం త‌గ్గుతుంది. కారం ఎక్కువైతే పిత్త దోషం పెరుగుతుంది. కారంను కూడా నిత్యం త‌క్కువ‌గా తీసుకోవాలి.

5. చేదు

చేదుగా ఉన్న ప‌దార్థాల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్రంగా మారుతుంది. పిత్త‌, క‌ఫ దోషాలు త‌గ్గుతాయి. చేదుగా ఉన్న ప‌దార్థాల‌ను నిత్యం కొద్దిగా ఎక్కువ మోతాదులో తీసుకున్నా పెద్ద‌గా స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం కావు.

6. వ‌గ‌రు

వ‌గ‌రు ఉన్న ప‌దార్థాల‌ను కూడా నిత్యం తినాలి. కానీ వీటిని త‌క్కువ‌గా తీసుకోవాలి. లేదంటే జీర్ణాశ‌యంలో గ్యాస్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది. ఇక పిత్త దోషం ఉన్న వారికి ఈ రుచి ఉన్న ప‌దార్థాలు ఎంత‌గానో మేలు చేస్తాయి. ప‌చ్చి అర‌టి పండ్లు, క్రాన్ బెర్రీలు, గ్రీన్ బీన్స్ వంటివి ఈ రుచి ఉన్న ప‌దార్థాల‌కు ఉదాహ‌ర‌ణ‌లుగా చెప్ప‌వ‌చ్చు.

అయితే భోజనం చేసేట‌ప్పుడు ఒకే సారి ఆరు రుచులు క‌లిసిన ప‌దార్థాల‌ను తినాల్సిన ప‌నిలేదు. రోజులో మొత్తంగా చూసుకుంటే ఈ ఆరు రుచులు ఉన్న ప‌దార్థాల‌ను తిన్నామా, లేదా అనేది చెక్ చేసుకుంటే చాలు. ఉద‌యం, మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నాల్లో ఈ ఆరు రుచుల నుంచి ఏవైనా రెండు రుచులు క‌లిగిన ఆహారాల‌ను ఎంచుకుని తింటే చాలు. అంటే ఉద‌యం చేదు, కారం, మ‌ధ్యాహ్నం తీపి, వ‌గ‌రు, రాత్రి పులుపు, ఉప్పు.. ఇలా రెండేసి రుచులు ఉండేలా ఆహారాల‌ను తీసుకుంటే చాలు. ఇవే తినాల‌ని ఏమీ లేదు. ఎవ‌రికి న‌చ్చిన‌ట్లు వారు ఆహారాల‌ను ఎంచుకుని ఆరు రుచులు క‌వ‌ర్ అయ్యేలా చూసుకుంటే చాలు. దీంతో ఆరు రుచులు నిత్యం శ‌రీరానికి అందుతాయి. ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

Share
Admin

Recent Posts