యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ (యూటీఐ).. దీన్నే మూత్రాశయ ఇన్‌ఫెక్షన్ అంటారు. ఈ సమస్య సహజంగానే చాలా మందిలో వస్తుంటుంది. ఇది పురుషుల కన్నా స్త్రీలలోనే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ సమస్య ఉన్నవారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మూత్రాశయ ఇన్‌ఫెక్షన్ ఉన్నవారిలో పెల్విక్ భాగంలో నొప్పి ఉంటుంది. మహిళల్లో ఈ నొప్పి ఉంటుంది. తరచూ మూత్ర విసర్జన వెళ్లాల్సి వస్తుంది. మూత్రం విసర్జించేటప్పుడు మంటగా అనిపిస్తుంది. కొన్ని సార్లు మూత్రంలో రక్తం కూడా పడుతుంది. పురుషుల్లో అయితే మల విసర్జన చేసే భాగంలో నొప్పి ఉంటుంది. మూత్రం పోసేటప్పుడు దుర్వాసన వస్తుంది. జ్వరం, వికారం, చలిగా అనిపించడం, వాంతికి వచ్చినట్లు ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో, మెనోపాజ్ మహిళలలో, డయాబెటిస్, కిడ్నీ స్టోన్లు ఉన్నవారిలో, గర్భిణీల్లో, వయస్సు మీద పడిన వారిలో మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి.
మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారు రోజూ పౌష్టికాహారం తీసుకోవాలి. ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. రోజుకు కనీసం 2 లీటర్ల నీటిని తాగాలి. మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోరాదు. వ్యక్తిగత పరిశుభత్రను పాటించాలి.
నిమ్మజాతికి చెందిన పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. అలాగే క్రాన్ బెర్రీలు, దానిమ్మ పండు జ్యూస్, గ్రీన్ టీని ఎక్కువగా తాగాలి. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. రోజూ ఉదయాన్నే రెండు వెల్లుల్లి రెబ్బలను పరగడుపునే తింటుండాలి. దీని వల్ల మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు.