మన శరీరంలో పలు జీవక్రియలు, పనులు సరిగ్గా నిర్వర్తించబడాలంటే అందుకు కొలెస్ట్రాల్ అవసరం. కనుక మనం నిత్యం కొలెస్ట్రాల్ ఉండే ఆహారాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో మన శరీరం హార్మోన్లను తయారు చేసుకుంటుంది. అలాగే విటమిన్ డిని తయారు చేసుకుంటుంది. అయితే కొలెస్ట్రాల్ అసలు లేకపోవడం ఎంత ప్రమాదకరమో, ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నా.. అంతే ప్రమాదకరం. కనుక కొలెస్ట్రాల్ స్థాయిలు ఎప్పుడూ నియంత్రణలో ఉండాలి.
అయితే కొలెస్ట్రాల్ పేరు చెప్పినప్పుడల్లా మనకు రెండు మాటలు బాగా వినిపిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ అని. మంచి కొలెస్ట్రాల్ అని. అయితే కొందరు కొలెస్ట్రాల్ అంటే చెడు చేస్తుందని అనుకుంటారు. కానీ అలా కాదు, మనకు కీడు చేసే కొలెస్ట్రాల్ వేరే ఉంటుంది. దాన్ని చెడు కొలెస్ట్రాల్ అంటారు. ఇక మంచి చేసే కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. దాన్ని మంచి కొలెస్ట్రాల్ అంటారు. వైద్య పరిభాషలో చెప్పాలంటే చెడు కొలెస్ట్రాల్‌ను ఎల్‌డీఎల్ అని అంటారు. అంటే.. Low-Density Lipoprotein (LDL) అని పూర్తి రూపంలో చెప్పాల్సి ఉంటుంది. ఇక మంచి కొలెస్ట్రాల్‌ను హెచ్‌డీఎల్ అంటారు. అంటే.. High-Density Lipoprotein (HDL) అని పూర్తి అర్థం వస్తుంది.
అయితే మన శరీరానికి ఎల్‌డీఎల్ కీడు చేస్తుంది, హెచ్‌డీఎల్ మేలు చేస్తుంది. కనుక మనం హెచ్‌డీఎల్ ను పెంచే ఆహారాలను నిత్యం తీసుకోవాలి. ఎల్‌డీఎల్‌ను పెంచే ఆహారాలను తీసుకోవడం మానేయాలి. కొవ్వు పదార్థాలు, జంక్ ఫుడ్, నూనె పదార్థాలు, వేపుళ్లు, ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, చిరు తిళ్లను ఎక్కువగా తినడం వల్ల మన శరీరంలో ఎల్‌డీఎల్ పేరుకుపోతుంది. ఇది మంచిది కాదు. కనుక దీన్ని తగ్గించాలంటే హెచ్‌డీఎల్‌ను పెంచే ఆహారాలను తీసుకోవాలి. వాటిల్లో పండ్లు, తాజా కూరగాయలు, తృణ ధాన్యాలు, స్కిన్ లెస్ చికెన్, చేపలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, గుమ్మడికాయ విత్తనాలు, అవిసె గింజలు, బాదంపప్పు, పప్పు దినుసులు, ఆలివ్ ఆయిల్ ముఖ్యమైనవి. వీటిని నిత్యం తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అంటే ఎల్‌డీఎల్ తక్కువగా ఉంటుంది. హెచ్‌డీఎల్ ఎక్కువగా ఉంటుంది. ఇలా ఉండడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
మన శరీరంలో కొవ్వు మొత్తం 3 రకాలుగా ఉంటుంది. హెచ్‌డీఎల్, ఎల్‌డీఎల్‌తోపాటు ట్రై గ్లిజరైడ్స్ అని ఉంటాయి. ఎల్‌డీఎల్ లాగే ట్రై గ్లిజరైడ్స్ కూడా ప్రమాదకరమే. ఇవి కూడా తక్కువగానే ఉండాలి. లిపిడ్ ప్రొఫైల్ టెస్టులో మనకు వీటి గురించి ఇస్తారు. అందులో ట్రై గ్లిజరైడ్స్ స్థాయిలు 150 mg/dL కన్నా తక్కువగా ఉండాలి. అలాగే హెచ్‌డీఎల్ స్థాయిలు 55 mg/dL కన్నా ఎక్కువగా ఉండాలి. ఎల్‌డీఎల్ స్థాయిలు 130 mg/dL కన్నా తక్కువ ఉండాలి. దీంతో మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు సరిగ్గా ఉన్నట్లు లెక్క. అప్పుడు గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. కనుక మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. తగ్గినా, పెరిగినా అందుకు అనుగుణంగా జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. నిత్యం వ్యాయామం చేయడంతోపాటు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవచ్చు.