ఫిగ్స్.. వీటినే అత్తి పండ్లు అని.. అంజీర్ పండ్లు అని అంటారు. వీటి లోపల లేత పింక్ లేదా ముదురు పింక్ రంగులో విత్తనాలు, గుజ్జు ఉంటాయి. పై భాగంలో ఆకుపచ్చ, పర్పుల్, నీలం రంగును కలిగి ఉంటాయి. మనకు మార్కెట్‌లో ఈ పండ్లు డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ లభిస్తాయి. అయితే ఈ పండ్లు చూసేందుకు కొందరికి అంతగా చక్కగా అనిపించవు. కానీ నిజానికి ఈ పండ్లతో మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అత్తిపండ్లను తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ముఖ్యంగా మలబద్దకం తగ్గుతుంది. 150 మందికి నిత్యం 4 అంజీర్ డ్రై ఫ్రూట్స్‌ను ఇచ్చారు. తరువాత వారిలో కొన్ని రోజులకు మలబద్దక తగ్గినట్లు గుర్తించారు. అందువల్ల ఇవి జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికే కాక, మలబద్దకాన్ని తగ్గించడంలోనూ అమోఘంగా పనిచేస్తాయి.
అంజీర్ పండ్లు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. వీటిని తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. దీంతో గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. గుండె సురక్షితంగా ఉంటుంది. 83 మందికి నిత్యం 14 డ్రై అంజీర్ పండ్లను ఇచ్చారు. 5 వారాల తరువాత పరీక్షించి చూడగా వారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గాయి. అందువల్ల కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఈ పండ్లను కచ్చితంగా రోజూ తినాల్సిందే.
డయాబెటిస్ ఉన్న వారు డ్రై అంజీర్ పండ్లను తినరాదు. కానీ సాధారణ పండ్లను తినవచ్చు. దీంతో వారిలో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.
అంజీర్ పండ్లలో ఉండే పోషకాలు పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూస్తాయి. అంజీర్ పండ్లను తరచూ తినడం వల్ల కోలన్, బ్రెస్ట్, సర్వికల్, లివర్ క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.
డెర్మటైటిస్ సమస్య ఉన్నవారు, పొడి చర్మం ఉన్నవారు, చర్మం బాగా దురదలు వచ్చే వారు అంజీర్ పండ్లను తినాలి. ఇవి ఆయా సమస్యలను తగ్గిస్తాయి.
గమనిక: అత్తి పండ్లు మలబద్దకానికి మంచివే అయినప్పటికీ కొందరిలో ఇవి రివర్స్‌గా పనిచేస్తాయి. అంటే వీటిని తినడం వల్ల కొందరిలో మలబద్దకానికి బదులుగా విరేచనాలు అవుతాయి. అలాంటి సమస్య ఉత్పన్నమైతే వెంటనే పండ్లను తినడం మానేయాలి. అలాగే రక్తం పలుచబడేందుకు ట్యాబ్లెట్లను వేసుకునే వారు ఈ పండ్లను తినేముందు డాక్టర్లను సలహా అడగాలి. లేదంటే ఆ మెడిసిన్‌తో ఈ పండ్లు కలిసి ఇతర అనారోగ్య సమస్యలను తెచ్చి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఇక కొందరికి ఈ పండ్లను తినడం వల్ల అలర్జీలు వస్తాయి. అలాంటి సమస్య వచ్చినా వీటిని తినరాదు.