కిడ్నీ స్టోన్ల సమస్య ఉంటే ఎవరికైనా సరే పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వస్తుంటుంది. ఏ పని చేద్దామన్నా నొప్పి తీవ్రంగా ఉంటుంది. దీంతో అసలు మనస్కరించదు. కిడ్నీ స్టోన్లు ఉన్నవారిలో వెన్ను భాగంలో కింద వైపు లేదా పొత్తి కడుపులో లేదా పక్కలకు నొప్పి ఉంటుంది. మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా అనిపిస్తుంది. తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంటుంది. కొందరికి మూత్రంలో రక్తం కూడా పడుతుంది. మూత్రం దుర్వాసన వస్తుంది. వికారంగా అనిపిస్తుంటుంది. వాంతులు అవుతాయి. చలితో కూడిన జ్వరం ఉంటుంది. అయితే కిడ్నీ స్టోన్ల సమస్యకు డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవచ్చు. లేదా కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే కిడ్నీ స్టోన్లు త్వరగా కరిగేందుకు అవకాశం ఉంటుంది. మరి ఆ చిట్కాలు ఏమిటంటే…
ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగాలి. రోజులో ఒకటి లేదా రెండు సార్లు ఇలా తాగవచ్చు. దీంతో నిమ్మరసంలో ఉండే సిట్రేట్ అనబడే సమ్మేళనం కిడ్నీ స్టోన్లను కరిగిస్తుంది. అలాగే స్టోన్లను ఏర్పడకుండా చూస్తుంది.
యాపిల్ సైడర్ వెనిగర్ మనకు సూపర్ మార్కెట్లు, కిరాణా స్టోర్స్‌లో లభిస్తుంది. దీన్ని సాధారణంగా వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీన్ని నిత్యం తీసుకుంటే కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. అలాగే జీర్ణాశయ సమస్యలు తగ్గుతాయి. గ్లాస్ నీటిలో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలుపుకుని నిత్యం రెండు పూటలా తాగితే సమస్య నుంచి బయట పడవచ్చు. అయితే మోతాదుకు మించితే ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక తక్కువ మోతాదులో దీన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. 1 టీస్పూన్‌కు మించకుండా చూసుకోవాలి.
కిడ్నీ స్టోన్లను కరిగించడంలో కొబ్బరినీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. కొబ్బరినీళ్లలో ఉండే పొటాషియం కిడ్నీలకు ఎంతగానో మేలు చేస్తుంది. మూత్రం యొక్క ఆమ్ల స్వభావం తగ్గుతుంది. ఉదయం, సాయంత్రం 200 ఎంఎల్ మోతాదులో కొబ్బరి నీళ్లను తాగితే మంచిది.
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 1 టీస్పూన్ బేకింగ్ సోడాను కలుపుకుని ఉదయం, సాయంత్రం తాగితే కిడ్నీ స్టోన్లు కరుగుతాయి. అధిక ఆమ్లత్వం వల్ల ఏర్పడ్డ కిడ్నీ స్టోన్లు ఈ విధంగా కరిగిపోతాయి.
గోధుమ గడ్డిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మూత్రాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. దీంతో కిడ్నీ స్టోన్లు మూత్రంతో సహా సులభంగా బయటకు వస్తాయి. అందువల్ల నిత్యం ఉదయం, సాయంత్రం 30 ఎంఎల్ మోతాదులో గోధుమ గడ్డి జ్యూస్‌ను తాగితే మంచిది.