ఫ్లూ లేదా కోవిడ్ 19 ఏదైనా సరే వైరస్‌ల వల్ల వ్యాప్తి చెందుతాయి. అయితే ఫ్లూ కన్నా కోవిడ్ 19 వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ క్రమంలోనే ఫ్లూ సమస్యకు, కోవిడ్‌కు దాదాపుగా ఒకేలాంటి లక్షణాలు ఉంటాయి. వాటిని గుర్తించడం కొద్దిగా కష్టమే. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ రెండు సమస్యలకు మధ్య ఉన్న తేడాలను సులభంగా గుర్తించవచ్చు.
కొందరికి ఫ్లూ, కోవిడ్ రెండూ ఒకేసారి వ్యాప్తి చెందేందుకు అవకాశాలు ఉంటాయి. అందువల్ల అలాంటి వారికి రెండు వ్యాధులకు చెందిన లక్షణాలు కనిపిస్తాయి. దీంతో వ్యాధి ఏదో గుర్తించడం కష్టతరం అవుతుంది.
కోవిడ్ 19 వచ్చిన వారికి రుచి, వాసనలను పసిగట్టే శక్తి ఉండదు. అందువల్ల కోవిడ్ ను సులభంగా గుర్తించవచ్చు. అయితే ఫ్లూ వచ్చిన వారికి జ్వరం ఎక్కువగా వస్తుంటుంది. ఇక కొందరికి ఫ్లూ వస్తే విరేచనాలు కూడా అవుతాయి. కొన్ని కోవిడ్ కేసుల్లోనూ విరేచనాలు ఎక్కువగా అవుతుంటాయి. అందువల్ల దీన్ని బట్టి రెండింటి మధ్య తేడాలను గుర్తించడం కష్టం.
ఇక కోవిడ్, స్వైన్ ఫ్లూ, సీజనల్ ఫ్లూ ల మధ్య కొన్ని లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి. కొన్ని మాత్రం వేరేగా ఉంటాయి. శ్వాసకోశ సమస్యలు వస్తే సహజంగానే జ్వరం, వణకడం వంటి లక్షణాలు ఉంటాయి. కొందరికి దగ్గు వస్తుంది. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. అలసట, నీరసం, తిరగడం, స్పృహ తప్పి పడిపోతున్నట్లు అనిపించడం, గొంతు సమస్యలు, ముక్కు నుంచి నీరు కారడం, ముక్కు దిబ్బడ, ఛాతి పట్టేయడం, కండరాల నొప్పులు ఆయా వ్యాధులు వచ్చిన వారిలో సహజంగానే కనిపించే లక్షణాలు.
ఇక కొందరికి తీవ్రమైన ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వికారంగా ఉండడం, వాంతికి వచ్చినట్లు అనిపించడం లేదా వాంతులు అవుతుండడం, ఆకలి లేకపోవడం, విరేచనాలు, రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఇవి కోవిడ్‌కు సంకేతాలు.
పైన తెలిపిన లక్షణాల్లో ఏవి ఉన్నా సరే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి నిర్దారణ అయ్యాక చికిత్స తీసుకోవాలి. లేదంటే ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడుతాయి.
కోవిడ్ వచ్చిన వారిలో సహజంగానే రుచి, వాసన కోల్పోవడం, జ్వరం, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఇక మిగిలిన లక్షణాలు అన్నీ స్వైన్ ఫ్లూ, సీజనల్ ఫ్లూ వచ్చిన వారిలో ఉంటాయి. అందువల్ల వాటిని జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా ఏ వ్యాధి బారిన పడ్డారో ఒక అంచనాకు రావచ్చు. అయితే ఎలాంటి లక్షణాలు ఉన్నా సరే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. కొన్నిసార్లు మనం అంచనా వేసిన వ్యాధి తప్పు కావచ్చు. కనుక డాక్టర్ ను కలిసి ముందుగా వ్యాధి నిర్దారణ చేయాలి. ఈ క్రమంలో వైద్య పరీక్షల్లో వచ్చే రిపోర్టు ఆధారంగా డాక్టర్లచే చికిత్స తీసుకోవాలి. దీంతో ఆయా వ్యాధుల నుంచి త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది.