డాక్టర్ల వద్దకు వెళ్లినప్పుడు సహజంగానే వారు మన కళ్లు, గోర్లు, నాలుకలను పరిశీలించి మన ఆరోగ్యం గురించి తెలుసుకుంటారు. ఆయా భాగాల్లో వచ్చే మార్పులు, అవి కనిపించే రంగులను బట్టి వారు రోగి స్థితి గతులను అంచనా వేస్తుంటారు. అందుకు అనుగుణంగా వారు రోగులకు చికిత్స చేస్తారు. అయితే ముఖ్యంగా డాక్టర్లు నాలుకను చూసే చాలా విషయాలు తెలుసుకుంటారు. నాలుక ఉన్న రంగును బట్టి మనకు ఏయే అనారోగ్య సమస్యలు ఉన్నాయో మనం కూడా ఇట్టే సులభంగా తెలుసుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. నాలుక లైట్ పింక్ రంగులో ఉంటే ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. దానిపై కొద్దిగా తెల్లని కోటింగ్ ఉన్నా ఏమీ కాదు. నార్మల్‌గానే ఉన్నారని అర్థం చేసుకోవాలి.
2. నాలుక తెలుపు రంగులో ఉంటే నోట్లో శుభ్రంగా లేదని, నోటి శుభ్రతను పాటించడం లేదని అర్థం. శరీరం డీహైడ్రేషన్‌కు గురైనా నాలుక ఇలాగే కనిపిసస్తుంది. కొన్నిసార్లు ఫ్లూ ఉన్నా ఇలాగే నాలుక కనిపిస్తుంది.
3. మీ నాలుక పసుపు రంగులో కనిపిస్తుందంటే మీ శరీరంలో పోషకాల లోపం ఉందని అర్థం చేసుకోవాలి. అందుకు అనుగుణంగా పరీక్షలు చేయంచుకుని చికిత్సలు తీసుకోవాలి. జీర్ణవ్యవస్థ పనితీరు సరిగ్గా లేకున్నా, లివర్, జీర్ణాశయ సమస్యలు ఉన్నా అలా నాలుక పసుపు రంగులో కనిపిస్తుంది. ఆయా సమస్యల వల్లే నాలుకపై పసుపు రంగు కోటింగ్ ఏర్పడుతుంది.
4. నాలుక బ్రౌన్ కలర్ లో ఉందంటే.. మీరు కెఫీన్ ఎక్కువగా ఉండే కాఫీ, టీలను ఎక్కువగా తాగుతున్నారని అర్థం. లేదా పొగ తాగినా అలాగే నాలుక బ్రౌన్ రంగులో కనిపిస్తుంది.
5. నాలుక నలుపు రంగులో ఉందంటే మీరు అప్రమత్తంగా ఉండాలి. చెయిన్ స్మోకర్ల నాలుక అలాగే నలుపు రంగులో ఉంటుంది. క్యాన్సర్, అల్సర్, ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు ఉన్నా, నోట్లో శుభ్రత పాటించకపోయినా, నాలుకపై బాక్టీరియా పేరుకుపోయినా అలా నాలుక నలుపు రంగులో కనిపిస్తుంది.
6. నాలుక మరీ ఎరుపు రంగులో కనిపిస్తుందంటే శరీరంలో ఫోలిక్ యాసిడ్ లేదా విటమిన్ బి12 లోపించిందని అర్థం చేసుకోవాలి. దీంతో ఆయా పోషకాలు ఉండే ఆహారాలు లేదా సప్లిమెంట్లను ఎక్కువగా తీసుకోవాలి.
7. నాలుక నీలం లేదా పర్పుల్ కలర్‌లో ఉందంటే.. అందుకు కారణం గుండె సమస్యలు అయి ఉండవచ్చు. గుండె తగినంత రక్తాన్ని లేదా ఆక్సిజన్‌ను పంప్ చేయలేకపోతుంటే అలా నాలుక ఆ రంగుల్లో కనిపిస్తుంది. ఈ క్రమంలో వెంటనే అలర్ట్ అయి పరీక్షలు చేయించుకుని చికిత్సను తీసుకోవాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365