వేసవి తాపం నుంచి మనకు ఉపశమనం అందించేందుకు వర్షాకాలం వస్తుంది. ముఖ్యంగా ఈ నెల నుంచి వర్షాలు ఎక్కువగా కురుస్తుంటాయి. ఈ క్రమంలో ఈ సీజన్‌లో అనేక రకాల ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. ప్రధానంగా కళ్లకు ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. కంజంక్టివైటిస్, కళ్లు పొడి బారడం, దురదలు పెట్టడం, కళ్ల నుంచి నీరు కారడం.. వంటి సమస్యలు వస్తుంటాయి. అందువల్ల వ్యక్తిగత పరిశుభత్రను పాటించాల్సి ఉంటుంది. దీంతో కంటి ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. అయితే ఈ సీజన్‌లో కళ్లను సురక్షితంగా ఉంచుకునేందుకు కింద తెలిపిన సూచనలను పాటించాల్సి ఉంటుంది. అవేమిటంటే..
మన శరీరంలో కళ్లు చాలా ముఖ్యమైన అవయవాలు. వర్షాకాలంలో వీటికి అనేక రకాల ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. బాక్టీరియా, వైరస్‌లు దాడి చేసి ఇన్‌ఫెక్షన్లను కలిగిస్తుంటాయి. దీంతోపాటు కలుషిత నీరు, ఇతర అనారోగ్య సమస్యలు, అలర్జీల కారణంగా కూడా కళ్లకు ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. అందువల్ల కళ్లను సురక్షితంగా ఉంచుకోవాలి.
1. చేతులను ఎల్లప్పుడూ శుభ్రం చేసుకుంటుండాలి. చేతులతో కళ్లను రుద్దడం వల్ల బాక్టీరియా, వైరస్‌లు కళ్లలో చేరి ఇన్‌ఫెక్షన్లను కలిగిస్తాయి. దీంతో కళ్లు వాపులకు గురవుతాయి. కళ్ల నుంచి నీరు కారుతుంది. కళ్లు ఎర్రగా మారుతాయి. సగం ఇన్‌ఫెక్షన్లు మనకు చేతుల నుంచే వస్తాయి. కనుక చేతులను ఎల్లప్పుడూ శుభ్రం చేసుకోవాలి. అందుకు సబ్బు లేదా శానిటైజర్‌ను ఉపయోగించాలి. దీంతో చాలా వరకు ఇన్‌ఫెక్షన్లను రాకుండా చూసుకోవచ్చు.
2. ఇంట్లో కొందరు ఒకే టవల్‌ను అందరూ ఉపయోగిస్తారు. అలాగే నాప్‌కిన్లు, హ్యాండ్ కర్చీఫ్‌లను కూడా ఒకరు వాడింది మరొకరు వాడుతుంటారు. అలా చేయరాదు. చేస్తే కళ్లకు ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. కనుక ఎవరి వస్తువులను వారే వాడాలి. ఆఖరికి సబ్బుతో సహా ఒకరు వాడేది మరొకరు వాడరాదు. దీంతో సురక్షితంగా ఉండవచ్చు.
3. కాంటాక్ట్ లెన్స్ లేదా కళ్లద్దాలను వాడేవారు రోజూ వాటిని శుభ్రమైన క్లాత్‌తో క్లీన్ చేస్తుండాలి. డాక్టర్లు సూచించిన విధంగా ఐ డ్రాప్స్ ను వాడాలి. దీంతో ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు.
4. కళ్లను ఎల్లప్పుడూ కొందరు చేతుల్తో అదే పనిగా రుద్దుతుంటారు. అలా చేయరాదు. చేస్తే ఇన్‌ఫెక్షన్ మరింత ఎక్కువవుతుంది. తప్ప తగ్గదు. ఇక కళ్లను చల్లని నీళ్లతో ఎప్పుడూ శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల కళ్లు మంటలు రావడం, ఎరుపెక్కడం తగ్గుతాయి. కళ్లలో పడే దుమ్ము, ధూళి కణాలు బయటకు వచ్చేస్తాయి. కళ్లు శుభ్రమవుతాయి.
5. కళ్ల నొప్పి లేదా అలర్జీ వస్తే మేకప్ ను, ఇతర సౌందర్య సాధనాలను వాడరాదు.
6. సడెన్‌గా కంటి చూపులో తేడాలు వచ్చినా.. అంటే అస్పష్టంగా పరిసరాలు కనిపిస్తున్నా లేదా దురదలు వచ్చినా, కళ్ల నొప్పి, ఇతర సమస్యలు వచ్చినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. తగిన చికిత్స తీసుకోవాలి.
7. కంటి సమస్యలు ఉన్నవారు కొద్ది సేపు కళ్లను వేగంగా మూస్తూ తెరుస్తుండాలి. దీని వల్ల చాలా వరకు కళ్ల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కళ్లలో ద్రవాలు చేరతాలు. పొడిబారిన కళ్లకు ఈ విధంగా చేస్తే మేలు జరుగుతుంది. అధికంగా నీటిని తాగడం వల్ల కూడా కంటి సమస్యలు తగ్గుతాయి. కంప్యూటర్ల ఎదుట కూర్చునే వారు 20 నిమిషాలకు ఒకసారి 20 సెకన్ల పాటు బ్రేక్ తీసుకోవాలి. ఆ 20 సెకన్ల సమయంలో కంప్యూటర్ తెరను కాకుండా వేరే ఏవైనా వస్తువులను చూడాలి. 20 అడుగుల దూరంలో ఉండే వస్తువులను 20 సెకన్ల పాటు చూడాలి. దీన్నే 20-20-20 ఫార్ములా అంటారు. ఇలా చేయడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కళ్లు పొడిబారకుండా చూసుకోవచ్చు.
8. కళ్లలో దుమ్ము లేదా ధూళి, ఇతర కణాలు పడితే ఇన్‌ఫెక్షన్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక దుమ్ము, ధూళిలో ఉన్నప్పుడు కళ్లకు రక్షణగా గ్లాసెస్ లేదా ఇతర వియరబుల్స్‌ను ధరించాలి. దీంతో కళ్లకు రక్షణ లభిస్తుంది.
9. కాంటాక్ట్ లెన్స్‌లను వాడేవారు వర్షాకాలంలో వాటిని రోజూ శుభ్రం చేయాలి. లేదంటే ఇన్‌ఫెక్షన్లు వస్తాయి.
10. వర్షాకాలంలో స్విమ్మింగ్ పూల్‌లలో ఈత కొట్టరాదు. వాటిల్లో బాక్టీరియా అధికంగా ఉంటుంది. కనుక ఈత కొట్టినప్పుడు అది కళ్లలోకి చేరుతుంది. ఇన్‌ఫెక్షన్లను కలిగిస్తుంది. కనుక వర్షాకాలంలో స్విమ్మింగ్ పూల్స్‌లోకి వెళ్లరాదు.
ఈ సూచనలను పాటించడం వల్ల వర్షాకాలంలో కళ్లు ఇన్‌ఫెక్షన్లకు గురి కాకుండా కాపాడుకోవచ్చు..!
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365